న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ ఎర్రకోట కారు పేలుడు కేసు దర్యాప్తు అల్ ఫలాహ్ యూనివర్సిటీ (Al Falah University) చుట్టూ తిరుగుతున్నది. ఈ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు 9 సంస్థలను నిర్వహించాడు. రూ.7.5 కోట్ల మోసం కేసులో అరెస్టైన ఆయన జైలు శిక్ష కూడా అనుభవించాడు. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ ట్రస్టీ జావేద్ అహ్మద్ సిద్ధిఖీ ఈ యూనివర్సిటీకి నిధులు సమకూర్చాడు. ఈ నేపథ్యంలో ఈ నిధులపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దర్యాప్తు చేస్తున్నది.
కాగా, మధ్యప్రదేశ్‌కు చెందిన జావేద్ అహ్మద్ సిద్ధిఖీకి విస్తారమైన కార్పొరేట్ నెట్వర్క్ ఉన్నది. ఢిల్లీలోని జామియా నగర్లో అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్ట్ కార్యాలయం ఉన్న అల్ ఫలాహ్ హౌస్ చిరునామాతో విద్య, సాఫ్ట్వేర్, ఆర్థిక సేవలు, ఇంధన రంగాలకు చెందిన 9 కంపెనీలున్నాయి. మొదటి కంపెనీ అల్ ఫలాహ్ ఇన్వెస్ట్మెంట్ 1992లో ప్రారంభమైంది. అల్ ఫలాహ్ మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్, అల్ ఫలాహ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ ఫలాహ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఫౌండేషన్, అల్ ఫలాహ్ ఎడ్యుకేషన్ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్, ఎంజేహెచ్ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ ఫలాహ్ సాఫ్ట్వేర్ ప్రైవేట్ లిమిటెడ్, అల్ ఫలాహ్ ఎనర్జీస్ ప్రైవేట్ లిమిటెడ్, టార్బియా ఎడ్యుకేషన్ ఫౌండేషన్ సంస్థలను సిద్ధిఖీ నిర్వహించాడు.
మరోవైపు అల్ ఫలాహ్ గ్రూప్ ఆఫ్ కంపెనీల్లో డబ్బులు డిపాజిట్ చేయడానికి ప్రజలను ప్రోత్సహించే నకిలీ పెట్టుబడి పథకాలను ప్రవేశపెట్టినట్లు జావేద్ అహ్మద్ సిద్ధిఖీ, ఇతరులపై ఆరోపణలు వచ్చాయి. పెట్టుబడులను షేర్లుగా మార్చినట్లుగా నమ్మించేందుకు నకిలీ పత్రాలు సృష్టించారు. సేకరించిన నిధులను వ్యక్తిగత ఖాతాలకు మళ్లించారు.
దీంతో రూ.7.5 కోట్ల మోసం కేసులో సిద్ధిఖీ, అనుచరుడు జావేద్ అహ్మద్‌పై ఢిల్లీలోని న్యూ ఫ్రెండ్స్ కాలనీ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో 2001లో సిద్దిఖీని పోలీసులు అరెస్ట్ చేశారు. 2003 మార్చిలో ఆయన బెయిల్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు తిరస్కరించడంతో మూడేళ్లపాటు జైలులో ఉన్నాడు. అయితే మోసపోయిన పెట్టుబడిదారులకు డబ్బు తిరిగి చెల్లించడానికి సిద్దిఖీ అంగీకరించడంతో 2004 ఫిబ్రవరిలో కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
కాగా, జావేద్ అహ్మద్ సిద్ధిఖీకి చెందిన 9 సంస్థలు 2019 వరకు పనిచేశాయి. ఆయన అరెస్ట్ తర్వాత కొన్ని మూతపడగా మరికొన్ని సంస్థలు యాక్టివ్‌గా లేవు. అయితే అల్ ఫలాహ్ మెడికల్ రీసెర్చ్ ఫౌండేషన్ మాత్రమే ఉనికిలో ఉన్నది. 1997లో ఇంజినీరింగ్ కాలేజీగా ప్రారంభమైన ఈ విద్యా సంస్థ ప్రస్తుతం 78 ఎకరాల క్యాంపస్‌గా విస్తరించింది. ఢిల్లీ కారు పేలుడు కేసులో ఈ విద్యా సంస్థ కీలకంగా మారింది. ఫలాహ్ యూనివర్సిటీ ఉద్యోగులైన సయీద్, షకీల్, ఇతరులు ఈ కేసులో నిందితులుగా ఉన్నారు. ఈ నేపథ్యంలో నాక్ విచారణను కూడా ఈ విద్యా సంస్థ ఎదుర్కొంటోంది.
Also Read:
Ajit Pawar | ‘నా మనస్సాక్షితో నిర్ణయం తీసుకుంటా’.. రాజీనామా డిమాండ్‌పై అజిత్ పవార్
Watch: పెళ్లిలో వరుడిపై కత్తితో దాడి.. నిందితులను డ్రోన్‌తో వెంబడించిన కెమెరామెన్