న్యూఢిల్లీ: ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో కారుతో ఆత్మాహుతి దాడి(Delhi Blast)కి పాల్పడిన ఘటన తెలిసిందే. ఆ ఘటనకు చెందిన దర్యాప్తు కొనసాగుతున్నది. వైట్‌కాలర్ టెర్రర్ మాడ్యూల్ గుట్టు విప్పుతున్న పోలీసులకు కొన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తున్నాయి. ఎర్రకోట వద్ద డాక్టర్ ముజంమ్మిల్ గన్నై రెక్కీ గీసినట్లు గుర్తించారు. జనవరిలో అతను రెడ్ ఫోర్ట్‌ను విజిట్ చేసినట్లు తేల్చారు. డాక్టర్ ముజమ్మిల్ ఫోన్ డిటేల్స్ ఆధారంగా దీన్ని కన్ఫర్మ్ చేశారు. ఆత్మాహుతి దాడికి పాల్పడిన డాక్టర్ ఉమర్ నబీ కూడా జనవరిలో రెడ్ ఫోర్ట్‌ను విజిట్ చేసినట్లు దర్యాప్తు అధికారులు పేర్కొన్నారు. నవంబర్ 10వ తేదీన జరిగిన కారు పేలుడు ఘటనలో డాక్టర్ ఉమర్ ఒక్కడే పాల్గొన్నాడు. గణతంత్య్ర దినోత్సవం రోజున చరిత్రాత్మక కట్టడం ఎర్రకోటను టార్గెట్ చేయాలన్న ఉద్దేశంతో ఆ డాక్టర్లు రెక్కీ వేసినట్లు అనుమానిస్తున్నారు. అయితే ఆ సమయంలో అక్కడ ఉన్న పటిష్టమైన పెట్రోలింగ్ విధానం వల్ల ప్లాన్ వాయిదా వేసినట్లు గుర్తించారు.
మరో వైపు హుందయ్ ఐ20 కారు అమ్మకం కేసులో అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఫరీదాబాద్ కారు డీలర్‌ను ఇవాళ అరెస్టు చేశారు. రాయల్ కార్ ప్లాజాకు చెందిన అమిత్ అనే డీలర్‌ను ఇవాళ ఢిల్లీ పోలీసు శాఖ స్పెషల్ సెల్ అరెస్టు చేసింది. ఫరీదాబాద్ పోలీసుల సహకారంతో సెక్టార్ 37 నుంచి అతన్ని ఆధీనంలోకి తీసుకున్నారు. ఎర్రకోట వద్ద జరిగిన పేలుడుకు వాడిన హుందయ్ కారు అమ్మకంలో అమిత్ సహకరించినట్లు తెలుస్తోంది.
ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ కూడా పేలుడు ఘటనపై స్పందించింది. డాక్టర్ ముజమ్మిల్ అహ్మద్ గనై, డాక్టర్ అదీల్ రాథర్‌లతో తమకు సంబంధం లేదని వర్సిటీ పేర్కొన్నది. తమ కాలేజీలో ఎటువంటి రసాయనాలు స్టోర్ చేయలేదని తెలిపారు. ఢిల్లీ పేలుడు ఘటనలో 12 మంది మృతిచెందారు.