Delhi blast case : దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన పేలుడు కేసు (Delhi blast Case) లో నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ (NIA) దర్యాప్తు జరుపుతోంది. దర్యాప్తులో భాగంగా జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లోని పలు ప్రాంతాల్లో ఎన్ఐఏ ఇవాళ సోదాలు నిర్వహిస్తోంది. ఇందుకోసం సోమవారం తెల్లవారుజాము నుంచి తనిఖీలు చేపట్టింది. హంద్వారా (Handwara) లోని ఓ వ్యాపారి నివాసంలో ఎన్ఐఏ అధికారులు సోదాలు చేశారు.
ఈ కేసులో అరెస్టైన వైద్యులకు ఆయుధాలు సరఫరా చేసిన వ్యక్తులతో ఆ వ్యాపారికి సంబంధం ఉన్నట్లు గుర్తించామనని అధికారులు తెలిపారు. ఇప్పటికే పలు కీలక పత్రాలతోపాటు, డిజిటల్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు. ఈనెల మొదట్లో పుల్వామా, కుల్గాం, శోపియాన్, బారాముల్లా, కుప్వారా జిల్లాల్లో సోదాలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు. కాగా ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీ మృతికి వ్యతిరేకంగా జమ్మూకశ్మీర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు జరుగుతుండటంతో ఇటీవల దర్యాప్తునకు ఆటంకం కలిగిందని అన్నారు.
ఢిల్లీ పేలుడులో చనిపోయిన సూసైడ్ బాంబర్ ఉమర్ నబీకి ఆయుధాలు సరఫరా చేసిన మరో ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేశామని ఎన్ఐఏ అధికారులు చెప్పారు. వీరంతా స్లీపర్ సెల్స్‌గా ఉంటూ ఉగ్ర సంస్థలకు సమాచారం చేరవేస్తున్నట్లు తెలిపారు. వీరి అరెస్టుతో ఈ కేసులో మొత్తం అరెస్టయినవారి సంఖ్య 11కి చేరిందన్నారు.