న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆదివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షాకు సవాల్ విసిరారు. ఢిల్లీ మురికివాడల్లో కూల్చివేతలకు సంబంధించిన కేసులన్నిటినీ ఉపసంహరించి, అక్కడి నుంచి నిరాశ్రయుడైన ప్రతి వ్యక్తికి పునరావాసం కల్పించాలని డిమాండ్ చేశారు.
అక్కడ ప్రతి వ్యక్తికి ఇంటిని నిర్మిస్తామని బీజేపీ నేతలు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తే, తాను శాసన సభ ఎన్నికల్లో పోటీ చేయబోనని చెప్పారు. ఈ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే, వెంటనే మురికివాడలను కూల్చేయాలనుకుంటున్నదని ఆరోపించారు. ఈ ఆరోపణలను కేంద్ర మంత్రి, బీజేపీ నేత హర్దీప్ సింగ్ పురి ఖండించారు.
ఢిల్లీ ఎన్నికల కోసం ఆప్ నిధి సేకరణను ప్రారంభించింది. కల్కాజీ నుంచి పోటీ చేస్తున్న సీఎం ఆతిశీ ఆదివారం పార్టీ ప్రధాన కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తమ పార్టీ రాజకీయాలు నిజాయితీపై ఆధారపడ్డాయన్నారు.