Air Pollution | దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం (Air Pollution) కొనసాగుతోంది. శనివారం ఉదయం కూడా గాలి నాణ్యత సూచీ పేలవమైన స్థాయిలో నమోదైంది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ (Central Pollution Control Board) అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉన్న డేటా ప్రకారం.. శనివారం ఉదయం 8 గంటల సమయంలో రాజధాని ప్రాంతంలో ఓవరాల్ ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 257గా నమోదైంది.
అత్యధికంగా ఆనంద్ విహార్‌లో ఏక్యూఐ స్థాయి 413గా నమోదైంది. వజీర్‌పూర్‌లో 342, షాదీపూర్‌లో 329, జహన్గిరిపురిలో 320, పంజాబీ బాగ్‌లో 296, బురారి ప్రాంతంలో 292, అలీపూర్‌లో 289, అశోక్ విహార్ ప్రాంతంలో 284, ఐటీవో 284, సోనియా విహార్‌లో 264, గురుగ్రామ్‌లోని సెక్టార్ 51లో 330, ఫరీదాబాద్‌లో 229, ఘజియాబాద్‌లోని ఇందిరాపురంలో 300, నోయిడాలో 307, మీటర్లో 263గా గాలి నాణ్యత సూచీ నమోదైంది.
ఉదయం నుంచి నగరాన్ని దట్టమైన పొగ కమ్మేసింది. దీంతో విజిబిలిటీ కూడా పడిపోయింది. ఫలితంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాలుష్యం తీవ్రమైన నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న వ్యక్తులు, వృద్ధులతోపాటూ చిన్నారులు జాగ్రత్తగా ఉండాలన్నారు. వాయు కాలుష్యం కారణంగా ఛాతీలో అసౌకర్యం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, దగ్గు, కండ్ల మంటలు వంటి వాటికి గురవుతారని హెచ్చరిస్తున్నారు. వాయు కాలుష్యం కట్టడికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
ఎయిర్ క్వాలిటీ అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ అండ్ రిసెర్చ్ నివేదిక ప్రకారం.. గాలి నాణ్యత 447కు పడిపోవడం అంటే దాన్ని తీవ్ర వాయు కాలుష్యంగా పరిగణించవచ్చు. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 0-100 మధ్య ఉంటే గాలి నాణ్యత బాగా ఉండి, కాలుష్యం లేదని, AQI 100-200 మధ్య ఉంటే గాలి నాణ్యత మధ్యస్తంగా ఉందని అర్థం. ఇక AQI 200-300 మధ్య ఉంటే గాలి నాణ్యత అధ్వాన్నంగా ఉందని, AQI 300-400 మధ్య ఉంటే గాలి నాణ్యత మరింత అధ్వాన్నంగా ఉందని, AQI 400-500 మధ్య ఉంటే కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉందని అర్థం చేసుకోవచ్చు.
ఈ నెల 29న ఢిల్లీలో మొదటిసారిగా కృత్రిమ వర్షాన్ని (cloud seeding) కురిపించేందుకు ఏర్పాట్లు చేశామని సీఎం రేఖా గుప్తా వెల్లడించారు. బురాయ్లో ప్రయోగాత్మక పరీక్ష విజయవంతమైందన్నారు. ఐఐటీ-కాన్పూర్ సహకారంతో ఢిల్లీ ప్రభుత్వం చేపట్టిన ఈ ప్రాజెక్ట్‌కు ఐఎండీ, ఐఐటీఎమ్-పుణె తోడ్పాటును అందిస్తున్నాయి. దీపావళి తర్వాత పొగ మంచు సీజన్లో కాలుష్య కణాలను తగ్గించడానికి వాయువ్య ఢిల్లీలో అయిదు చోట్ల ఈ కృత్రిమ వర్షం కురిపించనున్నారు. ఇందుకోసం డీజీసీపీ అనుమతి పొందారు. సిల్వర్ అయోడైడ్ లేదా సోడియం క్లోరైడ్ లాంటి పదార్థాలను మేఘాల్లోకి విడుదల చేయడం ద్వారా కృత్రిమ వర్షాన్ని కురిపిస్తారు.
Also Read..
Car Accident: డివైడర్‌ను ఢీకొట్టి.. పాదచారులపై దూసుకెళ్లిన కారు.. అయిదుగురు మృతి
Harvard University | హార్వర్డ్ యూనివర్సిటీలో కాల్పుల కలకలం
Road Accident | కారును ఢీకొట్టిన కంటైనర్.. మహిళా మంత్రికి తప్పిన ప్రమాదం