న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీని ఇవాళ కూడా పొగమంచు(Delhi Air Quality) కమ్మేసింది. శనివారం తెల్లవారుజామున ఢిల్లీ వీధులన్నీ పొగమంచుతో నిండిపోయాయి. దీంతో అక్కడ విజిబులిటీ తగ్గిపోయింది. స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉదయం 8 గంటలకు ఢిల్లీలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ 384గా ఉన్నది. దీంతో అక్కడ విజిబులిటీ పూర్ క్యాటగిరీలోకి వెల్లింది. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రకారం కొన్ని ప్రాంతాల్లో కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నట్లు తెలిసింది.
నగరంలోని అనేక ప్రాంతాల్లో కాలుష్యం స్థాయి ఆందోళనకరంగా ఉన్నది. సీపీసీబీ ప్రకారం సరాయి కాలే ఖాన్ వద్ద ఏక్యూఐ 428గా ఉంది. అక్షర్‌దామ్ వద్ద 420 ఏక్యూఐ రికార్డు అయ్యింది. తులారామ్ మార్గ్ వద్ద 403గా రిజిస్టర్ అయ్యింది. ఆనంద్ విహార్ వద్ద 428, అశోక్ విహార్ వద్ద 407, ఐటీవో వద్ద 429 లెవల్స్ నమోదు అయ్యాయి.
వాయు నాణ్యత తగ్గిపోవడంతో ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ కమీషన్ కఠిన చర్యలు తీసుకున్నది గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా ఢిల్లీతో పాటు ఎన్సీఆర్ ప్రాంతంలో స్టేజ్-4 ప్రణాళిక అమలు చేస్తున్నది. గ్రాప్-4 ప్రకారం నిర్మాణ పనులను ఆపేస్తారు. డీజిల్ వాహనాలపై ఆంక్షలు ఉంటాయి. శనివారం తీవ్రమైన పొగమంచు ఉన్న కారణంగా.. ఇందిరా గాంధీ విమానాశ్రయ ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశారు. విజిబులిటీ తక్కువగానే ఉన్నా.. అన్ని విమానాలు నార్మల్‌గా నడుస్తున్నట్లు అధికారులు చెప్పారు. అయితే విమానాల తాజా అప్డేట్ కోసం సంబంధిత ఎయిర్‌లైన్ సంస్థలను కాంటాక్టు కావాలని ప్రయాణికులకు సూచన చేసింది.
పొగమంచు వల్ల ఢిల్లీలో సుమారు 100 విమానాల వరకు రద్దు అయ్యాయి. ఇక 50 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. ఫ్లయిట్‌రేడార్24 ట్రాకర్ ప్రకారం అనేక విమానాలు ఆలస్యంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది.