న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో గాలి నాణ్యత రెండో రోజు కూడా క్షీణించి కాలుష్యం ప్రమాదకర స్థాయికి చేరుకున్నది. కాలుష్య తీవ్రతను నిరోధించడానికి నగర వ్యాప్తంగా కృత్రిమ వర్షం కురిపించడమొక్కటే మార్గమని, ఇందుకు అనుమతించాలని ఢిల్లీ సర్కారు కేంద్రాన్ని కోరింది.
సాధారణ జీవితాన్ని ప్రభావితం చేస్తున్న ఈ సంక్షోభంపై ప్రధాని జోక్యం చేసుకోవాలని అభ్యర్థించింది. నిన్నటి గాలి నాణ్యత సూచీ (490) స్థాయితో పోలిస్తే మంగళవారం 460తో స్వల్పంగా మెరుగుదల నమోదైనా ఇంకా ప్రమాదకర విభాగంలోనే ఉంది.
ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయికి చేరుకున్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడాన్ని కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ తీవ్రంగా విమర్శించారు.
నగరంలో విద్యాసంస్థలు మూతపడ్డాయని, రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడిందని, ప్రజలకు ఇదో పీడకలగా మారిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఢిల్లీకి రాజధానిగా ఉండే యోగ్యత ఉందా? ఇదింకా రాజధానిగా కొసాగాలా? అని ఆయన ప్రశ్నించారు.