Air Pollutions | ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాయు కాలుష్యం ముప్పు పెరుగుతున్నది. బుధవారం గాలి నాణ్యత ‘వెరీ పూర్’ కేటరిగిలో నమోదైంది. ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ (AQI) 354గా నమోదైంది. ఏక్యూఐ తగ్గుతుండడంతో ఆరోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కాలుష్యం ఎక్కువ రోజులు కొనసాగితే దీర్ఘకాలిక వ్యాధుల బారినపడే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. దీపావళి నుంచి కాలుష్యం పెరగ్గా.. పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్‌లో వ్యవసాయ వ్యర్థాలను కాల్చివేస్తుండడంతో ఢిల్లీలో గాలి నాణ్యత క్షీణించడానికి కారణమని సంబంధిత వర్గాలు పేర్కొంటున్నాయి. కొనసాగుతున్న గాలి కాలుష్యం ద్వారా తీవ్రమైన వ్యాధుల బారినపడే ప్రమాదం ఉందని, ఈ క్రమంలో అందరూ జాగ్రత్తగా ఉండాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఢిల్లీ-ఎన్సీఆర్లో పొల్యూషన్ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలని మేదాంత ఇన్స్టిట్యూట్ ఆఫ్ చెస్ట్ సర్జరీ చైర్మన్ డాక్టర్ అరవింద్‌కుమార్ సూచించారు. వాయు కాలుష్యం అనేక విధాలుగా మన ఆరోగ్యాన్ని దెబ్బతిస్తుంది. కళ్ల మంట, వాపు, ఎర్రబడడం, కళ్లలో నీళ్లు కారడం, పొడిబారడం, దురద రావడం, ముక్కులో మంట, పెదవులపై వింత రుచి వంటి సమస్యలతో పలువురు ఆసుపత్రులకు వస్తున్నారన్నారు. ఇవన్నీ కాలుష్యం స్వల్పకాలిక ప్రభావాలని, దీర్ఘకాలిక సమస్యలైన ఛాతీ సంబంధిత వ్యాధుల ప్రమాదం పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వాయు కాలుష్యం బారినపడే అనేక దీర్ఘకాలిక దుష్ప్రభావాలు ఉంటాయని డాక్టర్ అరవింద్ పేర్కొన్నారు.
కలుషితమైన గాలిని పీల్చుకున్న సమయంలో ఛాతిలోకి గాలి ప్రవేశించిన సమయంలో శ్వాసనాళం, ఊపిరితిత్తుల్లో వాపు ప్రమాదాన్ని పెంచుతుంది. గాలిలో ఉండే విషపూరిత రసాయనాలు ఊపిరితిత్తులు శోషించుకుంటాయి. రక్తంలోకి వెళ్లి తల నుంచి కాలి వరకు వ్యాపించడం ప్రారంభమవుతుంది. దీంతో శరీరంలోని అనేక భాగాలపై ప్రభావం చూపుతుంది. ప్రస్తుతం ఇన్ఫెక్షన్, న్యుమోనియాతో ఎక్కువ మంది రోగులు ఆసుపత్రికి వస్తున్నారని డాక్టర్ అరవింద్ పేర్కొన్నారు. పెరుగుతున్న కాలుష్యం తర్వాత, న్యుమోనియా, ఛాతీ ఇన్ఫెక్షన్ కారణంగా ఐసీయూలో చేరిన రోగుల సంఖ్య పెరిగిందన్నారు.
వాయు కాలుష్యం కారణంగా, ఛాతీతో పాటు మెదడు సంబంధిత సమస్యలు పెరిగే ప్రమాదం ఉంటుందని డాక్టర్ అరవింద్ వివరించారు. దీంతో పిల్లల్లో చిరాకు పెరిగే సమస్య కూడా అధ్యయనాల్లో కనిపిస్తోందన్నారు. కాలుష్యం కారణంగా గాలిలో విషపూరితమైన పదార్ధాల కారణంగా న్యూరో ఇన్ల్ఫమేషన్ కేసులు ఉన్నాయి. వృద్ధుల్లో ఇది స్ట్రోక్ ప్రమాదాన్ని పది రెట్లు పెంచుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ వాయు కాలుష్యం నుంచి కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. వాయు కాలుష్య ప్రమాదాల నుంచి సురక్షింతంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ నివారణ చర్యలను నిరంతరం పాటించాలని సూచించారు. ఇంటి నుంచి బయటకు వెళ్లే సమయంలో తప్పనిసరిగా ఎన్-95 మాస్క్‌లు ధరించాలన్నారు. ఇంట్లో సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలన్నారు. ఇప్పటికే శ్వాసకోశ సమస్యలున్న వారు వైద్యుల సలహా మేరకు మందులు, ఇన్హేలర్లు వాడడం కొనసాగించాలని సూచించారు.