MDC | ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్లో ఖాళీగా స్టాండింగ్ కమిటీ స్థానానికి శుక్రవారం ఓటింగ్ జరిగింది. ఆమ్ ఆద్మీ పార్టీ, కాంగ్రెస్ ఎన్నికల్లో పాల్గొనలేదు. అయితే, ఎండీసీ స్టాండింగ్ కమిటీ ఎన్నికను ఆప్ రాజ్యాంగ, చట్ట విరుద్ధమని ఆమ్ ఆద్మీ పార్టీ పేర్కొంది. ఎన్నిక అక్రమ పద్ధతిలో జరిగిందని.. ఎన్నికల్లో లెఫ్టినెంట్ గవర్నర్, బీజేపీ, వారి అధికారులు రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని ఉల్లంఘించారని సీఎం అతిషీ ఆరోపించారు. సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు తెలిపారు. 18వ ఎండీసీ సభ్యుడి కోసం శుక్రవారం ఎన్నిక జరగ్గా.. ఆమ్ ఆద్మీ పార్టీ ఎన్నికల్లో పాల్గొనలేదు. బీజేపీ కౌన్సిలర్స్ మాత్రమే పాల్గొని ఓటు వేశారు. దాంతో అధికారులు బీజేపీ అభ్యర్థి విజయం సాధించినట్లు ప్రకటించారు. ఈ ఎన్నికలపై సీఎం అతిషీ మాట్లాడుతూ.. మన దేశం రాజ్యాంగ, రాజ్యాంగం ద్వారా రూపొందించిన చట్టాలపై నడుస్తుందన్నారు.
పార్లమెంట్ ఓ చట్టాన్ని ఆమోదించిందన్నారు. కార్పొరేషన్ సమావేశంలో దాని తేదీ, సమయం, స్థలాన్ని మేయర్ మాత్రమే నిర్ణయిస్తారని.. కార్పొరేషన్ సమావేశానికి మేయర్ మాత్రమే అధ్యక్షత వహిస్తారన్నారు. ప్రజాస్వామ్య ఉల్లంఘన, ప్రజాస్వామ్యం, రాజ్యాంగం ఉల్లంఘించినా బీజేపీ పట్టించుకోదని, అధికారాలు లేకపోయినా లెఫ్టినెంట్ గవర్నర్ ఉత్తర్వులు ఇస్తారని, కమిషనర్ ఆదేశాలను పాటించి కార్పొరేషన్ సమావేశాన్ని ఏర్పాటు చేసి ఎన్నికలు నిర్వహిస్తారని అతిషి విమర్శించారు. ఎన్నికైన మేయర్ స్థానంలో ఏఐఎస్ అధికారిని అధ్యక్షుడిగా చేస్తుందన్నారు. వివాదాల మధ్య శుక్రవారం జరిగిన ఎన్నికల్లో బీజేపీకి చెందిన సుందర్ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా ఎన్నికయ్యారు. ఆప్, కాంగ్రెస్ బహిష్కరించగా.. 115 ఓట్లతో సుందర్ సింగ్ తన్వర్ విజయం సాధించినట్లు ప్రకటించారు. 18 మంది సభ్యుల కమిటీలో బీజేపీకి 10, ఆప్‌కి ఎనిమిది మంది సభ్యులున్నారు.
వాస్తవానికి గురువారం అర్ధరాత్రి ఎన్నికలు జరగాల్సి ఉన్నా.. వాయిదాపడింది. ఎల్జీ ఆదేశాల మేరకు శుక్రవారం మళ్లీ సభను సమావేశ పరిచారు. అయితే, అయితే మేయర్ షైలీ ఒబెరాయ్, డిప్యూటీ మేయర్ అలె ఇక్బాల్, సీనియర్ కౌన్సిలర్ ముఖేష్ గోయల్ అధ్యక్షత వహించేందుకు నిరాకరించారు. ఆ తర్వాత కమిషనర్ ఎన్నికల నిర్వహణకు ప్రిసైడింగ్ అధికారిగా అదనపు కమిషనర్ జితేంద్ర కుమార్‌ను నియమించారు. ఒంటిగంటకు అడిషనల్ కమిషనర్ సమావేశానికి ప్రిసైడింగ్ అధికారిగా వచ్చి ఎన్నికలు నిర్వహించారు. ఈ సమయంలో బీజేపీకి చెందిన మొత్తం 115 మంది సభ్యులు హాజరయ్యారు. ఓటింగ్ సమయంలోనూ ఓటు వేయని సభ్యుల పేర్లను పిలిచారు. చివరకు ఎవరూ రాకపోవడంతో బీజేపీ అభ్యర్థి 115 ఓట్లతో గెలిచినట్లు ప్రకటించారు.