న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో మరో దారుణం జరిగింది. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ అభం శుభం తెలియని ఓ పసివాడి ప్రాణం మీదకు వచ్చింది. తప్పతాగి భార్యతో గొడవపడిన ఓ వ్యక్తి.. భార్య మీద కోపంతో రెండేండ్ల కొడుకును భవనం మొదటి అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు. అనంతరం మూడో అంతస్తుకు వెళ్లి అక్కడి నుంచి తను కూడా దూకేశాడు.
స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చి తండ్రీ కొడుకులను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఇద్దరూ చావుబతుకుల మధ్య ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఢిల్లీలోని కల్కాజీ ఏరియాలో ఇవాళ ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. కల్కాజీ ఏరియాకు చెందిన మాన్సింగ్ (30), పూజ (28) ఇద్దరూ భార్యాభర్తలు. వీరికి ఇద్దరు కొడుకులు.
అయితే పెండ్లయిన మొదటి నుంచి ఇద్దరికీ గొడవలు జరిగేవి. గొడవ జరిగినప్పుడల్లా పూజ పిల్లలతో కలిసి తన అమ్మమ్మ ఇంటికి వెళ్లి ఉండేది. మళ్లీ భర్త బతిమిలాడితే కాపురానికి వెళ్లేది. ఈ క్రమంలోనే ఇటీవల మరోసారి ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దాంతో పూజ ఎప్పటిలాగే పిల్లలిద్దరినీ తీసుకుని అమ్మమ్మ ఇంటికి వెళ్లింది.
ఈ క్రమంలో ఇవాళ నిందితుడు ఫూటుగా మద్యం సేవించి పూజ దగ్గరికి వెళ్లాడు. దాంతో పూజ కాపురానికి రానని తెగేసి చెప్పింది. ఈ క్రమంలో ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవ పెద్దదైంది. భార్య మీద కోపంతో ఊగిపోయిన మాన్సింగ్ తన చేతిలో ఉన్న రెండేండ్ల బాబును మొదటి అంతస్తు నుంచి కిందకు విసిరేశాడు.
దాంతో పూజ, ఆమె అమ్మమ్మ బాబు కోసం కిందకు పరుగు తీశారు. మాన్సింగ్ మాత్రం అదే కోపంలో భవనం మూడో అంతస్తుకు వెళ్లాడు. అక్కడి నుంచి అమాంతం కిందకు దూకేశాడు. ఈ ఘటనలో తండ్రీ, కొడుకులు ఇద్దరికీ తీవ్ర గాయాలయ్యాయి. కాగా, మాన్సింగ్ భార్య పూజ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు.