ఆదివారం 27 సెప్టెంబర్ 2020
National - Aug 10, 2020 , 01:53:40

రక్షణరంగంలో ఇక స్వదేశీ!

రక్షణరంగంలో ఇక స్వదేశీ!

  • 101 రకాల ఉత్పత్తుల దిగుమతులపై కేంద్రం ఆంక్షలు
  • ‘ఆత్మనిర్భర్‌ భారత్‌'కు ఊతమివ్వడానికే: రాజ్‌నాథ్‌
  • 2024 నాటికి నిషేధం పూర్తిగా అమల్లోకి
  • ఇక నుంచి వాటి తయారీ భారత్‌లోనే  
  • దేశంలోని కంపెనీలకు లభించనున్న 
  • 4 లక్షల కోట్ల కాంట్రాక్టులు

‘ఆత్మనిర్భర్‌ భారత్‌' నినాదాన్ని ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. దేశ భద్రతకు అత్యంత ముఖ్యమైన ఆయుధాలు, రక్షణ ఉత్పత్తుల కోసం ఇకపై విదేశాల మీద ఆధారపడకుండా ఉండేందుకు సాహసోపేతమైన నిర్ణయాన్ని వెల్లడించింది. రక్షణ రంగానికి సంబంధించిన 101 ఉత్పత్తుల దిగుమతులపై ఆంక్షలు విధించింది. క్షిపణులు, జలాంతర్గాములు, రాకెట్‌ లాంచర్లు, శిక్షణ విమానాలు ఈ జాబితాలో ఉన్నాయి. రక్షణ రంగంలో స్వావలంబన సాధిస్తూ, దేశీయ కంపెనీలకు లబ్ది చేకూర్చడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ పేర్కొన్నారు.

న్యూఢిల్లీ, ఆగస్టు 9: దేశీయ రక్షణ రంగాన్ని మరింత బలోపేతం చేయడానికి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకున్నది. ఇందులో భాగంగా 101 రకాల రక్షణ ఉత్పతుల  దిగుమతులపై ఆంక్షలు విధిస్తున్నట్టు కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఆదివారం ప్రకటించారు. 2024 నాటికి ఈ ఆంక్షలు పూర్తిగా అమల్లోకి వస్తాయన్నారు. ఈ మేరకు ట్విట్టర్‌లో వెల్లడించారు. ఆంక్షలు విధించిన ఉత్పతుల జాబితాలో ఆయుధాలు, తేలికపాటి హెలికాప్టర్లు, రవాణా విమానాలు, జలాంతర్గాములు, క్రూయిజ్‌ మిసైల్స్‌ (నౌకల నుంచి ప్రయోగించే క్షిపణులు) తదితరాలు ఉన్నాయి. తాజా నిర్ణయం వల్ల మనదేశంలోని రక్షణ రంగ పరిశ్రమలు రానున్న ఐదు నుంచి ఏడు ఏండ్లలో దాదాపు రూ. 4 లక్షల కోట్ల కాంట్రాక్టులను పొందే అవకాశమున్నదని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ ‘ఆత్మనిర్భర్‌ భారత్‌' పిలుపు మేరకు స్వదేశీ రక్షణ తయారీ రంగం పురోభివృద్ధికి తాజా నిర్ణయం నూతన జవసత్వాలను చేకూర్చుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ‘దేశీయ రక్షణ రంగం స్వావలంబన దిశగా పయనించేందుకు ఇదో పెద్ద అడుగు. అలాగే, దేశీయ రక్షణ రంగ సంస్థలకు ఇదో సువర్ణావకాశం. తాజా నిర్ణయంతో నిషేధిత జాబితాలోని ఉత్పత్తులను సొంత సాంకేతికత, డిజైన్‌తో అభివృద్ధి చేసుకునే వెసులుబాటు డీఆర్డీవో వంటి సంస్థలకు కలుగనున్నది’ అని పేర్కొన్నారు. 2020-21కి గానూ రక్షణ బడ్జెట్‌ను రెండు భాగాలుగా (దేశీయ, విదేశీ ) విభజించినట్టు ఆయన తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి దేశీయ రక్షణ ఉత్పత్తుల సేకరణ బడ్జెట్‌ కోసం రూ. 52 వేల కోట్లను కేటాయించినట్టు చెప్పారు. 

చర్చించిన తర్వాతనే..

రక్షణ, పరిశోధన అభివృద్ధి సంస్థ (డీఆర్డీవో), రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ సంస్థలు, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు, ప్రైవేటు పరిశ్రమలతో పలు దఫాల చర్చలు జరిపిన తర్వాతనే 101 రకాల రక్షణ ఉత్పత్తుల జాబితాను తయారుచేసినట్టు రాజ్‌నాథ్‌ వెల్లడించారు. ‘తాజా నిర్ణయంతో దేశీయ రక్షణ రంగ సంస్థలకు రానున్న ఐదు నుంచి ఏడేండ్లలో రూ. 4 లక్షల కోట్ల కాంట్రాక్టులు రానున్నాయి. ఇందులో ఆర్మీ, వాయుసేన నుంచి చెరో రూ. 1.3 లక్షల కోట్లు, నావికా దళం నుంచి రూ. 1.4 లక్షల కోట్ల విలువైన కాంట్రాక్టులు దేశీయ సంస్థలకు రాబోతున్నాయి’ అని రాజ్‌నాథ్‌ వివరించారు. పంద్రాగస్టున ‘ఆత్మనిర్భర్‌ భారత్‌' కొత్త రూపురేఖలను మోదీ వెల్లడిస్తారని చెప్పారు. 

జాబితాలో ఉన్న రక్షణ ఉత్పత్తులు

ఫిరంగులు, భూతలం నుంచి గగనతలంలోకి ప్రయోగించే క్షిపణులు,  క్రూయిజ్‌ మిసైల్స్‌, జలాంతర్గాములు, తీరప్రాంత గస్తీ నౌకలు, ఎలక్ట్రానిక్‌ యుద్ధ సామగ్రి, అత్యాధునిక క్షిపణి నౌకలు, రాకెట్‌ లాంచర్లు, శిక్షణ విమానాలు, సోనార్‌ సిస్టమ్‌, రాడార్‌, రాకెట్లు, తేలికపాటి హెలికాప్టర్లు, రవాణా విమానాలు

ప్రాజెక్ట్‌ చీతా 

చైనాతో సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో భారత త్రివిధ దళాలు ఎంతోకాలంగా పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టు చీతాను మళ్లీ తెరపైకి తెచ్చాయి. దీంట్లో భాగంగా 90 హెరోన్‌ డ్రోన్లు, ఆకాశం నుంచి ఆకాశంలోని లక్ష్యాలను, ఆకాశం నుంచి భూమిపై లక్ష్యాలను చేధించగల గైడెడ్‌ మిసైళ్లు, లేజర్‌ గైడెడ్‌ బాంబులు కావాలని రక్షణశాఖకు నివేదించాయి. ఈ మొత్తం ఆయుధాల విలువ రూ.3,500 కోట్లు. 


logo