Rajnath Singh | న్యూఢిల్లీ: భారత్, పాక్ దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్న నేపథ్యంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్ సింగ్ పాకిస్థాన్‌కు తీవ్ర హెచ్చరికలు జారీచేశారు. తమను రెచ్చగొడితే ‘తీవ్ర ప్రతిస్పందన’ ఉంటుందని తేల్చిచెప్పారు. ‘ఆపరేషన్ సిందూర్’ నేపథ్యంలో ప్రతీకారేచ్ఛతో రగిలిపోతున్న పాకిస్థాన్ 15 భారత సైనిక స్థావరాలపై దాడులకు యత్నించింది. ప్రతిగా పాకిస్థాన్‌లోని అనేక వైమానిక, రక్షణ రాడార్లను లక్ష్యంగా చేసుకున్న భారత్ గురువారం లాహోర్‌లోని రాడార్ వ్యవస్థను ధ్వంసం చేసింది.
ఢిల్లీలో జరిగిన ‘నేషనల్ క్వాలిటీ కాన్క్లేవ్’లో రాజ్‌నాథ్ ప్రసంగిస్తూ.. తాము ఎల్లప్పుడూ బాధ్యతగా వ్యవహరిస్తామని, చర్చల ద్వారా సమస్యలకు పరిష్కారం లభిస్తుందని విశ్వసిస్తామని చెప్పారు. అంతమాత్రాన తమ ఓపికను దుర్వినియోగం చేయవచ్చని దీని అర్థం కాదని నొక్కి చెప్పారు. ఎవరైనా దీనిని అలుసుగా తీసుకోవాలని ప్రయత్నిస్తే ‘తీవ్ర ప్రతిస్పందన’ను ఎదుర్కోవాల్సి వస్తుందంటూ ‘ఆపరేషన్ సిందూర్’ను గుర్తుచేశారు. భారత సాయుధ దళాలు ప్రదర్శించిన ధైర్యసాహసాలను ఈ సందర్భంగా రాజ్‌నాథ్ ప్రశంసించారు.
పాకిస్థాన్, పీవోకేలో ఉగ్ర శిబిరాలను ధ్వంసం చేసిన తీరు మనందరికీ గర్వకారణమని పేర్కొన్నారు. పాకిస్థాన్‌లోని ఉగ్రశిబిరాలపై దాడులు చాలా కచ్చితత్వంతో జరిగాయని, ఈ దాడుల్లో సామాన్యులకు ఎలాంటి హాని జరగలేదని వివరించారు. శిక్షణ పొందిన దళాలు అత్యంత నాణ్యమైన పరికరాలను కలిగి ఉండటం వల్లే ఇది సాధ్యమైందని తెలిపారు. రక్షణ ఉత్పత్తిలో నాణ్యత, పరిమాణంపై తమ ప్రభుత్వం సరిసమానంగా దృష్టిసారించిందని, వేగవంతమైన అభివృద్ధిని తీసుకొచ్చేందుకు ఆయుధ కర్మాగారాల కార్పొరేటీకరణ సహా అనేక విప్లవాత్మక చర్యలు తీసుకున్నట్టు రాజ్‌నాథ్ వివరించారు.
పాకిస్థాన్‌తో పరిస్థితిని(ఉద్రిక్తతలను) ఉల్లంఘించాలనే ఉద్దేశం భారత్‌కు లేదని.. కానీ తమ దేశంపై సైనిక దాడులు జరిగితే.. వాటికి స్పందన తీవ్రంగా ఉంటుందని విదేశాంగ మంత్రి జైశంకర్ గురువారం వ్యాఖ్యానించారు. ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్‌తో సమావేశం సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. క్రూరమైన పహల్గాం ఉగ్ర దాడి కారణంగానే తాము దేశ సరిహద్దు దాటి ఉగ్రవాద మౌలిక సదుపాయాలను ధ్వంసం చేయాల్సి వచ్చిందన్నారు. తమ దాడులు నిర్దిష్ట లక్ష్యాలపైనే సాగాయన్నారు. పొరుగు దేశంగా, సన్నిహిత భాగస్వామిగా ఇరాన్ ఈ పరిస్థితిని సరిగా అర్థం చేసుకోవడం ముఖ్యమని జైశంకర్ అన్నారు.