న్యూఢిల్లీ, మార్చి 13: వన్ ర్యాంక్-వన్ పెన్షన్ (ఓఆర్ఓపీ) బకాయిల చెల్లింపు విషయంలో సుప్రీంకోర్టు సోమవారం కేంద్రంపై అసహనం వ్యక్తం చేసింది. బకాయిలను నాలుగు వాయిదాల్లో చెల్లిస్తామని రక్షణ శాఖ జారీచేసిన నోటిఫికేషన్‌ను తప్పుబట్టిన సీజేఐ జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం.. చట్టాన్ని చేతుల్లోకి తీసుకోలేరని హెచ్చరించింది.
ఈ ఏడాది జనవరి 20న ఇచ్చిన నోటిఫికేషన్‌ను వెంటనే ఉపసంహరించుకోవాలని ఆదేశించింది. మాజీ సైనికులకు ఇప్పటికే ఒక విడత బకాయిలను చెల్లించామని, తదుపరి చెల్లింపులకు మరికొంత సమయం కావాలని కేంద్రం తరపున అటార్నీ జనరల్ ఆర్ వెంకటరమణి న్యాయస్థానాన్ని కోరారు. స్పందించిన ధర్మాసనం.. మొదట ఓఆర్ఓపీ బకాయిల చెల్లింపుపై జనవరి 20 ఇచ్చిన మీ నోటిఫికేషన్‌ను ఉపసంహరించుకోండి. మీరు అడుగుతున్న సమయాన్ని అప్పుడు పరిగణనలోకి తీసుకొంటాం’ అని స్పష్టం చేసింది.
అలా ఏకపక్షంగా చెప్పలేరు..
రక్షణ శాఖ నోటిఫికేషన్ తమ తీర్పునకు విరుద్ధమని, ఓఆర్ఓపీ బకాయిలను నాలుగు విడతల్లో చెల్లిస్తామని రక్షణ శాఖ ఏకపక్షంగా చెప్పలేదని సుప్రీంకోర్టు పేర్కొన్నది. ‘బకాయిల చెల్లింపునకు ఏదొక వర్గీకరణ ఉండాలి. ముందు వృద్ధులకు చెల్లింపులు చేయాలని కోరుతున్నాం’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.
తీర్పునకు విరుద్ధంగా నోటిఫికేషన్
జనవరి 9 తీర్పునకు విరుద్ధంగా 20న కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్‌ను పక్కన పెట్టాలని కోరుతూ ఇండియన్ ఎక్స్ సర్వీస్‌మెన్ మూవ్మెంట్ వేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ జరుపుతున్నది. బకాయిల చెల్లింపులో ఆలస్యంపై ఫిబ్రవరి 27న ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు, నోటిఫికేషన్‌పై వివరణ ఇవ్వాలని రక్షణశాఖ కార్యదర్శిని ఆదేశించింది. మార్చి 15లోగా బకాయిలన్నింటినీ చెల్లించాలని జనవరి 9న తీర్పునిచ్చింది.