బెంగళూరు, అక్టోబర్ 30: కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్యపై అడ్వకేట్ టీజే అబ్రహం బుధవారం పరువు నష్టం దావా వేశారు. సిద్ధరామయ్య తనను బ్లాక్‌మెయిలర్ అని నిందించారని ఆరోపిస్తూ ప్రత్యేక కోర్టును ఆశ్రయించారు. ముడా కుంభకోణంలో సిద్ధరామయ్యపై విచారణకు అనుమతించాలని గవర్నర్ థావర్‌చంద్ గెహ్లాట్‌కు ఫిర్యాదు చేసిన వారిలో అబ్రహం ఒకరు. ఈ సందర్భంగా అబ్రహం మాట్లాడుతూ… ‘నా మీద ప్రతీకారం తీర్చుకోవాలనే ఉత్సాహంతో సిద్ధరామయ్య నన్ను బ్లాక్‌మెయిలర్ అని, నాకు చెడు చరిత్ర ఉందని బహిరంగంగా వ్యాఖ్యానించారు. మీరు(సిద్ధరామయ్య) చట్టవిరుద్ధంగా ముడా నుంచి 14 స్థలాలను పొంది నన్ను బ్లాక్‌మెయిలర్ అంటున్నారు. నేను మీపై కోర్టులో పరువు నష్టం దావా వేశాను. మీరు ఎలా తప్పించుకుంటారో చూస్తా’ అని వ్యాఖ్యానించారు.
ముడాలో భారీ అవినీతి: బీజేపీ ఎంపీ
ముడా కుంభకోణం చాలా లోతైనదని, ముడాలో భారీ ఎత్తున అవినీతి జరిగిందనే విషయం రోజురోజుకూ స్పష్టమవుతున్నదని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లహర్ సింగ్ సిరోయా పేర్కొన్నారు. బుధవారం ఆయన బెంగళూరులో మాట్లాడుతూ… ముడా స్కామ్ కేవలం సిద్ధరామయ్య కుటుంబానికి 14 స్థలాల కేటాయింపునకు మాత్రమే పరిమితం కాదని, ఈ కుంభకోణం చాలా లోతైనదనే తన అనుమానాలు నిజం అవుతున్నాయని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి పదవికి సిద్ధరామయ్య రాజీనామా చేసి విచారణను ఎదుర్కోవాలని ఆయన డిమాండ్ చేశారు. ముడా కుంభకోణంలో ప్రస్తుత కాంగ్రెస్ ఎంపీ, అప్పటి ముడా డిప్యూటీ కమిషనర్ కుమార నాయక్ పాత్ర ఉందని ఆరోపించారు.