Rahul Gandhi : అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడు, కాంగ్రెస్ ఎంపీ రాహుల్‌గాంధీ తీవ్రంగా ఖండించారు. ఇలాంటి దాడులను ఏ మాత్రం సహించరాదని పేర్కొన్నారు. ట్రంప్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మేరకు రాహుల్‌గాంధీ ఒక ట్వీట్ చేశారు.
‘అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా. ఇలాంటి హేయమైన దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలి’ అని రాహుల్ తన అధికారిక ఎక్స్ ఖాతాలో పేర్కొన్నారు. అదేవిధంగా ‘ట్రంప్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటున్నా’ అని రాహుల్‌గాంధీ తన ఆకాంక్షను వెలిబుచ్చారు. కాగా అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కొన్ని నెలల ముందు ఈ ఘటన చోటుచేసుకోవడం కలకలం రేపింది.
ఈ అధ్యక్ష ఎన్నికల్లో జో బైడెన్‌తో తలపడుతున్న ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలో ఓ ర్యాలీలో పాల్గొన్నారు. ఆ ర్యాలీలో ట్రంప్ మాట్లాడుతుండగా దుండగులు అతనిపై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ట్రంప్ కుడి చెవికి గాయమైంది. బుల్లెట్ ట్రంప్ చెవిని తాకుతూ వెళ్లి వెనుకున్న వ్యక్తికి తగిలింది. అతను అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ప్రస్తుతం ట్రంప్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.