BSP | న్యూఢిల్లీ : బహుజన్ సమాజ్ పార్టీ అధినేత్రి మాయావతిని ప్రధాన మంత్రి అభ్యర్థిగా ప్రకటించాలని ఆ పార్టీ ఎంపీ మలూక్ నగర్ డిమాండ్ చేశారు. 2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తే.. ఇండియా కూటమిలో చేరేందుకు సిద్ధమని ఎంపీ షరతు విధించారు. బీఎప్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ పార్టీ తీసుకెళ్లిందని, అందుకు మాయావతికి ఆ పార్టీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఇక ఇండియా కూటమి ప్రధాని అభ్యర్థిగా మాయావతిని ప్రకటిస్తేనే, 2024 ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు సాధ్యమవుతుందన్నారు.
ఒక కాంగ్రెస్ పార్టీ దళితుడినే ప్రధాని చేయాలని భావిస్తే, మాయావతి కంటే ఉత్తమమైన మరో వ్యక్తి లేరని ఎంపీ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ తమ ప్రతిపాదను అంగీకరిస్తే, ఇండియా కూటమిలో చేరే విషయంపై మాయావతి ఆలోచిస్తారని ఆయన పేర్కొన్నారు. బీఎస్పీకి ఉత్తరప్రదేశ్లో 13.5 శాతం ఓటు బ్యాంక్ ఉందని తెలిపారు. మాయావతిని ప్రధాని అభ్యర్థిగా ప్రకటిస్తే 60 స్థానాల్లో గెలవడం ఖాయమని ఆయన చెప్పారు.
ఇక సమాజ్వాదీ పార్టీతో బీఎస్పీకి విబేధాలు ఉన్నాయన్న వార్తను ఎంపీ మలూక్ నగర్ కొట్టిపారేశారు. ఇండియా కూటమిలో మాయావతి చేరికపై అఖిలేష్ యాదవ్ ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయరని స్పష్టం చేశారు. మాయవతి పట్ల అఖిలేష్ అసంతృప్తిగా ఉన్నారని వస్తున్న వార్తలు అవాస్తవమని ఆయన తేల్చిచెప్పారు. వాస్తవానికి కాంగ్రెస్ పార్టీ వైఖరి పట్ల అఖిలేష్ యాదవ్ ఆగ్రహంగా ఉన్నారని చెప్పారు. ఎందుకంటే ఇటీవల జరిగిన మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ యాదవ కమ్యూనిటీకి సీట్లు ఇవ్వకపోవడం పట్ల సమాజ్వాదీ పార్టీ కోపంగా ఉందని తెలిపారు. సమాజ్వాదీ పార్టీతో తమకెలాంటి విబేధాలు లేవని ఎంపీ మలూక్ నగర్ మరోమారు స్పష్టం చేశారు.