సిమ్లా : కుండపోతతో నిలువెల్లా వణికిన హిమాచల్ ప్రదేశ్‌ను (Himachal Floods) వరద కష్టాలు వీడటం లేదు. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో హిల్ స్టేట్ తడిసిముద్దయింది. కోట్లాది రూపాయల ఆస్తి నష్టంతో పాటు వరదల కారణంగా పలువురు మృత్యువాత పడ్డారు. కనీవినీ ఎరుగని జల ప్రళయంతో వెన్ను విరిగిన హిమాచల్ వరదలను రాష్ట్ర విపత్తుగా ప్రకటించింది.
భారీ వర్షాలతో జల విధ్వంసం నెలకొనడంతో హిమాచల్ ప్రదేశ్ వరద బీభత్సాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు శుక్రవారం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. హిమాచల్ వరదలను జాతీయ విపత్తుగా ప్రకటించడంపై కేంద్ర ప్రభుత్వ స్పందన కోసం రాష్ట్రం వేచిచూస్తోందని పేర్కొన్నారు. ఇక గత వారం రోజులుగా హిమాచల్‌లో కుంభవృష్టి కురుస్తోంది. దీంతో రాష్ట్రంలోని నదులు పొంగి ప్రమాదకరస్థాయిని మించి ప్రవహిస్తున్నాయి. వరద ప్రవాహానికి రోడ్లు, వంతెనలు కొట్టుకుపోయాయి.
పలు చోట్ల భారీగా కొండచరియలు విరిగిపడుతున్నాయి. ఈ వర్షాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటి వరకు 74 మంది ప్రాణాలు కోల్పోయినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్ర రాజధాని సిమ్లా (Shimla)లోని సమ్మర్ హిల్ (Summer Hill) ప్రాంతంలో సోమవారం భారీగా కొండచరియలు విరిగిపడిన విషయం తెలిసిందే.
ఈ ఘటనలో సుమారు 21 మంది ప్రాణాలు కోల్పోయారు. తాజా వరదల్లో నష్టపోయిన బాధితుల కోసం సహాయ పునరావాస కార్యక్రమాలు ఊపందుకున్నాయని, బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలూ చేపడుతుందని సీఎం సుఖు పేర్కొన్నారు. వరదలు, కొండచరియలు విరిగిపడటంతో ఇండ్లు దెబ్బతిన్న వారికి తక్షణ సాయం అందిస్తామని చెప్పారు.
Read More :
Bomb Threat | విస్తారా విమానానికి బాంబు బెదిరింపు : ఎయిర్‌పోర్ట్‌లో తనిఖీలు