న్యూఢిల్లీ, ఫిబ్రవరి 4: స్కిడ్ గేమ్ వంటి దక్షిణ కొరియా టీవీ షోలను వీక్షించినా, కే-పాప్‌ను ఆలకించినా ఉత్తర కొరియా ప్రభుత్వం తన ప్రజలకు మరణశిక్ష విధిస్తున్నదని మానవ హక్కుల సంస్థ ఆమ్నెస్టీ ఇంటర్నేషనల్ తాజాగా వెల్లడించింది. దక్షిణ కొరియాకు చెందిన మీడియాను వినియోగించినా స్కూలు పిల్లలను సైతం ఉత్తర కొరియా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తున్నదని ఆమ్నెస్టీ తెలిపింది.
విదేశీ కంటెంట్ వాడకంపై యువజనులను హెచ్చరించడానికి బహిరంగ మరణశిక్షలను బలవంతంగా వారికి చూపిస్తున్నదని ఉత్తర కొరియా నుంచి తప్పించుకుని పారిపోయిన పౌరుల వాంగ్మూలాన్ని ఉటంకిస్తూ ఆమ్నెస్టీ వెల్లడించింది. ఆరోగ్యం, సామాజిక హోదాపై శిక్షలు ఆధారపడి ఉంటాయని, పేద ప్రజలు మరణంసహా కఠిన శిక్షలను ఎదుర్కోవలసి ఉంటుందని, పలుకుబడి ఉన్న లేదా సంపన్న కుటుంబాల వారు అధికారులకు లంచాలు ఇచ్చి మరణశిక్షలను తప్పించుకుంటారని హక్కుల సంస్థ వివరించింది.