Maneka Gandhi | ఉత్తరప్రదేశ్లోని పిలిభిత్ (Pilibhit) సిట్టింగ్ ఎంపీ వరుణ్ గాంధీ (Varun Gandhi)కి బీజేపీ (BJP) ఈసారి టికెట్ నిరాకరించిన విషయం తెలిసిందే. ఆయన స్థానంలో కాంగ్రెస్ నుంచి బీజేపీలో చేరిన జితిన్ ప్రసాదకు టికెట్ ఇచ్చింది. దీంతో వరుణ్ గాంధీకి బీజేపీ టికెట్ రాకపోవడంపై ఆయన తల్లి మేనకా గాంధీ (Maneka Gandhi) తొలిసారి స్పందించారు. పది రోజుల ఎన్నికల ప్రచారంలో భాగంగా యూపీలోని సుల్తాన్పూర్ (Sultanpur) నియోజకవర్గంలో పర్యటిస్తున్న మేనకా గాంధీని.. మీడియా ‘ఇప్పుడు వరుణ్ గాంధీ ఏం చేస్తారు..?’ అని ప్రశ్నించింది. దీనికి ఆమె ‘వరుణ్ గాంధీ ఏం చేయాలనుకుంటున్నారో ఆయన్నే అడగండి. లోక్సభ ఎన్నికల అనంతరం దాని గురించి ఆలోచిస్తాం. ఇంకా చాలా సమయం ఉంది’ అని సమాధానమిచ్చారు.
ఇదే సమయంలో బీజేపీ తనకు మరోసారి అవకాశం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఈ మేరకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాకు కృతజ్ఙతలు తెలిపారు. ‘నేను బీజేపీలో ఉన్నందుకు చాలా సంతోషంగా ఉంది. నాకు టిక్కెట్ ఇచ్చినందుకు ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డాజీకి ధన్యవాదాలు. అయితే, టికెట్ కేటాయించడంలో కొంత జాప్యం జరిగింది. దీంతో నేను పిలిభిత్..? లేదా సుల్తాన్పూర్..? ఎక్కడి నుంచి పోటీపడాలో అనే సందిగ్ధత ఏర్పడింది. ఇప్పుడు పార్టీ తీసుకున్న నిర్ణయానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను’ అని మేనకా గాంధీ అన్నారు.
ఉత్తరప్రదేశ్ పిలిభిత్ (Pilibhit) నియోజకవర్గం నుంచి లోక్సభకు ప్రాతినిథ్యం వహిస్తున్న వరుణ్ గాంధీ గత కొంతకాలంగా పార్టీ విధానాలపై తీవ్ర విమర్శలు చేస్తూ వస్తున్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం, ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వాలపై పలు సందర్భాల్లో తన అసమ్మతి గళాన్ని వినిపిస్తూ వచ్చారు. కీలక అంశాల్లో పార్టీ నిర్ణయాలపైనే బహిరంగ విమర్శలు గుప్పించారు. కొంతకాలంగా తన లోక్సభ నియోజకవర్గమైన పిలిభిత్లో క్రియాశీలకంగా ఉంటున్న ఆయన.. పార్టీ కార్యక్రమాలకు మాత్రం దూరంగా ఉంటూ వస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్కు ప్రతికూలంగా మాట్లాడుతున్నారు.
దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారంటూ ఊహాగానాలు కూడా వెలువడ్డాయి. ఈ క్రమంలో ఈసారి లోక్సభ ఎన్నికల్లో వరుణ్ గాంధీకి కమలం పార్టీ టికెట్ ఇవ్వలేదు. అయితే, ఆయన తల్లి మేనకా గాంధీకి మాత్రం మరోసారి అవకాశం కల్పించింది కమలం పార్టీ. యూపీలోని సుల్తాన్పూర్ నుంచి మరోసారి బరిలోకి దింపింది. పిలిభిత్ నుంచి వరుణ్ గాంధీ 2009, 2019లో విజయం సాధించారు. ఆయన రెండుసార్లు బీజేపీ నుంచే గెలిచిన విషయం తెలిసిందే.
Also Read..
Arvind Kejriwal | కేజ్రీవాల్ అభ్యర్థనలకు కోర్టు ఆమోదం.. ఏవేవి అనుమతించిందంటే..?
KTR | ఫోన్ ట్యాపింగ్లో నాపై ఆరోపణలు చేసినవారికి నోటీసులు: కేటీఆర్
Aam Aadmi Party: ఎన్నికలకు ముందే మరో నలుగురు ఆప్ నేతలు అరెస్టు: అతిషి