Arvind Kejriwal | ఢిల్లీ మద్యం కేసు (liquor policy scam)లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్టు చేసిన ఢిల్లీ సీఎం, ఆప్ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal )కు స్థానిక రౌస్ అవెన్యూ కోర్టు ఈనెల 15 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధించించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన్ని తీహార్ జైలుకు తరలించారు. ఈ నేపథ్యంలో జైల్లో చదువుకోవడానికి పుస్తకాలు, ఇంటి భోజనం, మందులు అనుమతించాలంటూ కేజ్రీ చేసిన అభ్యర్థనలకు కోర్టు ఆమోదం తెలిపింది (Court Has Allowed).
కేజ్రీ అభ్యర్థన మేరకు భగవద్గీత, రామాయణం, హౌ ప్రైమ్ మినిస్టర్స్ డిసైడ్ పుస్తకాలను అనుమతించాలని అధికారులను కోర్టు ఆదేశించింది. వీటితోపాటు తన ఆరోగ్యం దృష్ట్యా ఇంట్లో వండిన భోజనం, వాటర్ బాటిల్స్, మందులను అనుమతించింది. జైల్లో ఉన్న సమయంలో సడెన్‌గా బ్లడ్ షుగర్ లెవల్స్ పడిపోతే వాడేందుకు షుగర్ చాక్లెట్స్ (toffees), ఇంటి నుంచే పరుపులు, దిండ్లు, వైద్యులు సూచించిన విధంగా ఒక టేబుల్, కుర్చీ వంటి వస్తువులను కూడా అనుమతించింది.
వీటితోపాటు మతపరమైన లాకెట్ ధరించేందుకు కేజ్రీ పెట్టిన అభ్యర్థనకు సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. జైలు నిబంధనల ప్రకారం వస్తువులన్నింటినీ జైలు అధికారులు తరచూ పరిశీలిస్తుంటారని కోర్టు తెలిపింది. జైల్లో ఉన్న సమయంలో కేజ్రీ తన భార్య సునీతను కూడా కలుసుకోవచ్చని కోర్టు తెలిపింది. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ బీపీ, షుగర్ లెవల్స్‌ను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలని జైలు అధికారులను కోర్టు ఆదేశించింది.
జైల్లో కేజ్రీ దినచర్య
కాగా కేజ్రీవాల్‌ను తీహార్ జైలులోని నంబర్ 2 జైలులో ఉంచారు. ఇక్కడ 24 గంటలపాటు సీసీటీవీ నిఘా ఉంటుంది. 24/7 వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటారు. ఆయన షుగర్ వ్యాధితో బాధపడుతున్నందున రెగ్యులర్ చెకప్‌లు చేయనున్నారు. ఇక జైల్లో మిగిలిన ఖైదీల మాదిరిగానే కేజ్రీవాల్ దినచర్య ఉదయం 6.30 గంటలకే రోజు ప్రారంభం కానుంది. అల్పాహారంలో భాగంగా ఆయనకు టీ, కొన్ని రొట్టెముక్కలు (బ్రెడ్ స్లైసెస్) ఇవ్వనున్నారు. అనంతరం కోర్టు విచారణ ఉంటే ఆయన్ని తీసుకెళ్తారు. లేదంటే కేజ్రీవాల్ తన న్యాయబృందంతో సమావేశమయ్యేందుకు అనుమతి ఉంది. ఉదయం 10.30 నుంచి 11 గంటల మధ్య భోజనం ఇవ్వనున్నారు. మధ్యాహ్నం 12 నుంచి 3 వరకూ సీఎం తన జైలు గదిలోనే ఉండాల్సి ఉంటుంది. ఆ సమయంలో లాకప్‌కు తాళం వేస్తారు. ఖైదీలందరినీ లాకప్‌లోనే ఉంచుతారు. మధ్యాహ్నం 3.30 గంటలకు ఒక కప్పు టీ, రెండు బిస్కట్లు ఇస్తారు. సాయంత్రం 4 గంటలకు మళ్లీ తన లాయర్లతో సమావేశం అవ్వొచ్చు. సాయంత్రం 5.30 గంటలకే రాత్రి భోజనం అందిస్తారు. అనంతరం 7 గంటలకల్లా మళ్లీ సెల్‌లోకి పంపిస్తారు. జైల్లో కేజ్రీవాల్‌కు టీవీ చూసే సదుపాయం కూడా ఉంది.
ఆప్ నేతలంతా తీహార్ జైల్లోనే..
మరోవైపు మద్యం కుంభకోణం కేసులో జైలుకు వెళ్లిన ఆప్ నేతల్లో కేజ్రీవాల్ నాలుగో వ్యక్తి కావడం గమనార్హం. అంతకుముందు ఆప్ ఎంపీ సంజయ్ సింగ్, మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్‌ను కేంద్ర దర్యాప్తు సంస్థలు పలు కేసుల్లో అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. వాళ్లు కూడా ప్రస్తుతం తీహార్ జైలులోనే ఉన్న విషయం తెలిసిందే.
ఆయనే సీఎంగా కొనసాగుతారు: ఆప్
కేజ్రీవాల్‌ను ఎంతకాలం జైల్లో ఉంచినప్పటికీ, ఢిల్లీ సీఎంగా ఆయనే కొనసాగుతారని ఆప్ నేత జాస్మిన్ షా పేర్కొన్నారు. సీఎంగా ఢిల్లీ ప్రజలకు సేవ చేసేందుకు ఆయన రాజ్యాంగబద్ధంగా ప్రమాణస్వీకారం చేశారని, అది ఆయన బాధ్యత అని అన్నారు. జాస్మిన్ షా సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ మద్యం పాలసీ కేసులో ఆతిశీ, భరద్వాజ్ పేర్లను తీసుకురావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆప్‌ను ఖతం చేయాలంటే కేజ్రీవాల్‌ను మాత్రమే జైలుకు పంపిస్తే సరిపోదని బీజేపీ భావిస్తున్నదని ఆరోపించారు. మరోవైపు రానున్న రోజుల్లో పార్టీలో కేజ్రీవాల్ భార్య సునీత కీలక పాత్ర పోషించనున్నారని ఆప్ వర్గాలు పేర్కొన్నాయి.
Also Read..
Aam Aadmi Party: ఎన్నికలకు ముందే మరో నలుగురు ఆప్ నేతలు అరెస్టు: అతిషి
Ganja | రాజేంద్రనగర్‌లో 92 గంజాయి చాక్లెట్లు.. పాతబస్తీలో 14 కేజీల గంజా సీజ్
North Korea: బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిన ఉత్తర కొరియా