న్యూఢిల్లీ, జనవరి 7: ఆర్కిటిక్ మహాసముద్రంలో డెన్మార్క్‌కు చెందిన స్వతంత్ర ప్రతిపత్తి భూభాగమైన గ్రీన్‌లాండ్‌ను స్వాధీనం చేసుకోవాలన్న ఆకాంక్షను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి వ్యక్తం చేసిన నేపథ్యంలో యూరోపియన్ నాయకులు మంగళవారం డెన్మార్క్‌కు తమ మద్దతును పునరుద్ఘాటించారు. ఈ మేరకు ఫ్రాన్స్, బ్రిటన్, జర్మనీ, ఇటలీ, పోలాండ్, స్పెయిన్, డెన్మార్క్‌కు చెందిన నాయకులు ఓ సంయుక్త ప్రకటన విడుదల చేశారు.
సార్వభౌమత్వం, సరిహద్దు సమగ్రత, అవకాశం లేని ఆదేశాల ఉల్లంఘన విశ్వజనీన సిద్ధాంతాలని, వాటిని పరిరక్షించడంలో తాము తగ్గేది లేదని యూరోపియన్ నాయకులు స్పష్టం చేశారు. వెనెజువెలాలో అమెరికా సైనిక జోక్యం తర్వాత గ్రీన్‌లాండ్‌పై ట్రంప్ చేసిన వ్యాఖ్యలపై ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో యూరోపియన్ నాయకుల నుంచి ఈ సంయుక్త ప్రకటన విడుదలైంది.
ఇప్పటివరకు వెలికితీయని అత్యంత అరుదైన ఖనిజ నిక్షేపాలు గ్రీన్లాండ్లో ఉన్నాయి. అంతేగాక మంచుతో గడ్డకట్టిన ఆర్కిటిక్ మహాసముద్రంలో కీలక ధ్రువ మార్గాలపై ఉన్న గ్రీన్లాండ్ ద్వీపం అధీనమైతే మంచు కరిగినపుడు అమెరికాకు వ్యూహాత్మకంగా కీలకంగా మారనున్నది. మరో రెండు నెలల్లో గ్రీన్‌లాండ్‌పై ఒక నిర్ణయం తీసుకుంటానని ఆదివారం విలేకరులతో మాట్లాడుతూ ట్రంప్ వెల్లడించిన నేపథ్యంలో యూరోపియన్ నాయకులు స్పందించారు. ఆర్కిటిక్ భద్రత యూరోపునకు అత్యంత కీలకమైన ప్రాధాన్యతని, అంతర్జాతీయ, అట్లాంటిక్ సముద్రాంతర భద్రతకు చాలా ముఖ్యమని వారు పేర్కొన్నారు. అమెరికాతోసహా నాటో సభ్యదేశాలన్నీ కలసికట్టుగా ఆర్కిటిక్‌లో భద్రతను సమిష్టిగా సాధించాలని వారు తెలిపారు. గ్రీన్లాండ్తోసహా డెన్మార్క్ నాటోలో భాగమని వారు స్పష్టం చేశారు.
గ్రీన్లాండ్ అక్కడ నివసిస్తున్న వారి సొంతమని, డెన్మార్క్, గ్రీన్లాండ్కు సంబంధించిన వ్యవహారాలపై నిర్ణయం తీసుకోవలసింది ఆ రెండేనని యూరోపియన్ నాయకులు ప్రకటించారు. సంయుక్త ప్రకటనపై బ్రిటిష్ ప్రధాని స్టార్మర్, డానిష్ ప్రధాని ఫ్రెడెరిక్సెన్, ఫ్రెంచ్ అధ్యక్షుడు మాక్రాన్, జర్మన్ చాన్సలర్ మెర్జ్, ఇటలీ ప్రధాని జార్జియా మెలోనీ, పోలిష్ ప్రధాని డొనాల్డ్ టస్క్, స్పానిష్ ప్రధాని పెడ్రో సాంచెజ్ సంతకాలు చేశారు.