న్యూఢిల్లీ : దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగింది. దీంతో ఢిల్లీ- ఎన్సీఆర్ పరిధిలో ఆందోళన వ్యక్తమవుతోంది. వచ్చే వారంలో కాలుష్యం మరింత పెరిగే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరించారు. ఈ క్రమంలో కాలుష్యం నియంత్రణకు కఠిన చర్యలు చేపట్టాలని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ (CAQM) స్పష్టం చేసినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఇప్పటికే పొరుగు రాష్ట్రాల్లో వ్యర్థాల కాల్చివేతతో జాతీయ రాజధానిలో వాయు కాలుష్యం పెరుగుతోందని ఢిల్లీ ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసింది.
వాతావరణ శాఖ అంచనాల మేరకు.. ఈ నెల 21-24 మధ్య ఢిల్లీలో పూర్ కేటగిరి నుంచి మితమైన స్థాయికి చేరుకుంటుందని కమిటీ అభిప్రాయపడింది. ఈ క్రమంలో కొన్ని కఠిన చర్యలు తీసుకోవాలని, వ్యర్థాలను కాల్చివేయడం ఆపాలని, ఆదేశాలు ఉల్లంఘిస్తే భారీగా జరిమానాలు విధించాలని పేర్కొంది. ఢిల్లీ ఎన్సీఆర్ పరిధిలో పరిస్థితి మెరుగయ్యే వరకు ఇటుక బట్టీలను మూసివేయడంతో పాటు బాణాసంచాపై సుప్రీం కోర్టు, ఎన్టీజీ ఆదేశాలు ఖచ్చితంగా పాటించేలా చూడడం, కాలుష్యానికి కారణమయ్యే వాహనాలపై చర్యలు తీసుకోవాలని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.
ఢిల్లీ-ఎన్సీఆర్లో కాలుష్యం నివారణకు గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ రూపొందించగా.. గత కొన్ని రోజులుగా ఢిల్లీ, నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్, ఎన్సీఆర్లోని అన్ని నగరాల్లో వాయుకాలుష్యం కొనసాగుతున్నది. సోమవారం వర్షం కారణంగా కాస్త.. ఇది తాత్కాలిక ఉపశమనమేనని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ వాయు కాలుష్యాన్ని తగ్గించడానికి ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద వాహనాలను నిలిపివేసే ప్రచారాన్ని ప్రారంభించారు. కాలుష్య నియంత్రణకు ప్రజల భాగస్వామ్యాన్ని పెంచాలని పిలుపునిచ్చారు.