న్యూఢిల్లీ, అక్టోబర్ 19: ఓ మహిళపై ఐదుగురు కామాంధులు సామూహిక దాడికి పాల్పడి, క్రూరంగా చిత్రహింసలు పెట్టిన ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకొన్నది. రెండురోజుల పాటు నరకయాతన పెట్టి, ఆమె ప్రైవేట్ భాగంలో ఇనుప రాడ్డు జొప్పించారు. చేతులు, కాళ్లను కట్టేసి సంచిలో కుక్కి రోడ్డుపై పడేసిపోయారు. ఢిల్లీ మహిళా కమిషన్ తెలిపిన వివరాల ప్రకారం.. ఢిల్లీలోని నంద్నగ్రిలో నివాసముండే ఓ మహిళ (38) ఈ నెల 16న ఘజియాబాద్‌లోని తన సోదరుడి పుట్టినరోజు వేడుకల్లో పాల్గొని, అదే రోజు రాత్రి తిరిగి వచ్చేక్రమంలో ఆటో కోసం ఆగింది. అదే సమయంలో నలుగురు వ్యక్తులు కారులో వచ్చి ఆమెను కిడ్నాప్ చేసి, గుర్తుతెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు.
రెండురోజుల పాటు ఆమెపై సామూహిక లైంగికదాడికి పాల్పడ్డారు. అనంతరం రోడ్డుపై పడేసి వెళ్లిపోయారు. మంగళవారం తెల్లవారుజామున అపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని చూసిన కొందరు.. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం ఢిల్లీలోని జీటీబీ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితురాలి పరిస్థితి విషమంగా ఉన్నది. పోలీసులు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. అయితే, బాధితురాలు, నిందితుల మధ్య ఆస్తి తగాదాలు ఉన్నట్టు పోలీసులు ప్రాథమిక విచారణలో వెల్లడించారు. ఈ దారుణం నిర్భయ ఘటనను తలపించిందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఢిల్లీ మహిళా కమిషన్ చీఫ్ స్వాతి మాలివాల్ డిమాండ్ చేశారు.