కోలార్, సెప్టెంబర్ 20: బీజేపీ పాలిత రాష్ర్టాల్లో దళితులపై అకృత్యాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాని స్వరాష్ట్రం గుజరాత్లో దళితుల సామాజిక బహిష్కరణ ఘటనను మరువకముందే కర్ణాటకలోనూ అదే తరహా ఘటన చోటుచేసుకున్నది. దేవుడి విగ్రహాన్ని ఓ దళిత బాలుడు తాకాడని ఆరోపిస్తూ గ్రామస్థులు అతడి కుటుంబానికి జరిమానా విధించారు. అంతటితో ఆగకుండా కుటుం బం మొత్తాన్ని గ్రామం నుంచి బహిష్కరించారు. కొప్పల్ జిల్లా మలూరు తాలూకాలోని హుల్లేరహళ్లి గ్రామంలో ఈ అమానుష ఘటన చోటుచేసుకున్నది. గ్రామంలో కొత్తగా ఆలయాన్ని నిర్మించారు. ఈ సందర్భంగా వేడుక నిర్వహించాలని నిర్ణయించారు.
మూడు రోజుల కిందట, ఊరేగింపునకు సిద్ధంగా ఉంచిన విగ్రహాన్ని చేతన్ అనే దళిత బాలుడు ముట్టుకున్నాడు. విగ్రహాన్ని ఎత్తుకునేందుకు ప్రయత్నించాడు. గమనించిన గ్రామస్థులు బాలుడిని కొట్టి పంపించారు. అతడి కుటుంబానికి రూ.60 వేల జరిమానా విధించారు. అది చెల్లించేంత వరకు కుటుంబ సభ్యులెవరూ గ్రామంలోకి అడుగు పెట్టేందుకు వీలు లేదని హుకుం జారీచేశారు. అంతేగాకుండా బాలుడి తల్లికి బెదిరింపు కాల్స్ చేశారు. అయితే ఈ ఘటనపై దళిత కుటుంబం ఇంతవరకూ ఫిర్యాదు చేయలేదని పోలీసులు తెలిపారు.