లక్నో: యజమాని, అతడి సహచరులు కలిసి దళిత ఉద్యోగిని కొట్టారు. దీంతో మనస్తాపం చెందిన అతడు ఇంట్లో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. (Dalit Man Sets On Fire) ఈ నేపథ్యంలో యజమాని, అతడి భాగస్వాములపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని ఫిరోజాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. 20 ఏళ్ల దళిత యువకుడైన కమల్‌కాంత్ ప్రైవేట్ సంస్థలో పని చేస్తున్నాడు. అప్పు చెల్లించడం కోసం జూలై 6న యజమాని ప్రమోద్ అలియాస్ పప్పూను రూ.60,000 అడ్వాన్స్ అడిగాడు. దీంతో యజమాని ప్రమోద్ ఆగ్రహించాడు. తన సహచరులతో కలిసి కమల్‌కాంత్‌ను కట్టేసి కొట్టాడు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
కాగా, ఈ సంఘటనపై కమల్‌కాంత్ మనస్తాపం చెందాడు. మంగళవారం రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. కుటుంబ సభ్యులు పెళ్లి వేడుక కోసం వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
మరోవైపు ఇంటికి తిరిగి వచ్చిన కుటుంబ సభ్యులు, కమల్‌కాంత్ కాలి మరణించడం చూసి షాక్ అయ్యారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో యజమాని ప్రమోద్, అతడి భాగస్వాములైన భూరా, భోలు, అర్జున్, అనుజ్లపై గురువారం కేసు నమోదు చేశారు. అనూజ్‌ను శుక్రవారం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇతర నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నట్లు వెల్లడించారు.