లక్నో: స్కూల్‌కు వెళ్తున్న దళిత బాలికపై సామూహిక అత్యాచారం జరిగింది. (Dalit Girl Gang Raped) ఫిర్యాదు అందుకున్న పోలీసులు మైనర్ బాలుడితోపాటు మరో ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సుల్తాన్పూర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. 14 ఏళ్ల దళిత బాలిక పదో తరగతి చదువుతున్నది. మే 16న శుక్రవారం ఉదయం నడుస్తూ స్కూల్‌కు వెళ్తున్నది. దారిలో15 ఏళ్ల బాలుడు కారులో కనిపించాడు. స్కూల్ వద్ద దింపుతానని చెప్పి ఆ బాలికను కారులోకి ఎక్కించుకున్నాడు.
కాగా, మార్గమధ్యలో మరో ఇద్దరు యువకులు ఆ కారులోకి ఎక్కారు. ముగ్గురు కలిసి ఆ బాలికను ఒక గదికి తీసుకెళ్లారు. ఆమె చేతులు కట్టేసి, అరవకుండా నోటిని మూసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. గంట తర్వాత ఆ బాలిక స్పృహలోకి రావడంతో వారు అక్కడి నుంచి పారిపోయారు.
మరోవైపు బాధిత బాలిక జరిగిన దారుణం గురించి బంధువైన మహిళకు చెప్పింది. ఈ విషయం తెలుసుకున్న బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోక్సో, ఎస్సీ, ఎస్టీ చట్టంతో పాటు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మైనర్ బాలుడితోపాటు నిందితులైన 18 ఏళ్ల ప్రదీప్, సౌరభ్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు.
కాగా, నిందితులను రిమాండ్ నిమిత్తం జ్యుడీషియల్ కస్టడీకి తరలించినట్లు పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు ముందు రోజు మైనర్ బాలుడు ఇన్‌స్టాగ్రామ్‌లో బాలికను సంప్రదించాడని, తనను కలవాలని కోరగా ఆమె నిరాకరించినట్లు దర్యాప్తులో తెలిసిందని చెప్పారు. ఈ కేసుపై మరింతగా దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.