Cyclone Shakti : ఈ ఏడాది అరేబియా సముద్రం (Arabian Sea) లో తొలి తుఫాను (First cyclone) ఏర్పడింది. భారత వాతావరణ విభాగం (IMD) తాజాగా ఈ విషయాన్ని వెల్లడించింది. అరేబియా సముద్రంలో ఈశాన్యం వైపు ద్వారకకు 240 కిలోమీటర్ల దూరంలో, పోరుబందర్‌కు 270 కిలోమీటర్ల దూరంలో అల్పపీడనం ఏర్పడింది.
అది వాయుగుండంగా బలపడి గంటకు 12 కిలోమీటర్ల వేగంతో పశ్చిమ-వాయవ్య దిశగా కదులుతూ తుఫానుగా మారింది. రానున్న 24 గంటల్లో తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. ఈ తుఫాను కు ‘సైక్లోన్ శక్తి’ గా నామకరణం చేశారు. ప్రపంచ వాతావరణ సంస్థ ఆదేశాల ప్రకారం.. హిందూ మహాసముద్రం తీరప్రాంతంగా కలిగిన 13 దేశాలు ఈ తీరంలో ఏర్పడే తుఫానులకు పేర్లను నిర్ణయిస్తాయి.
భారత్, బంగ్లాదేశ్, ఇరాన్, మాల్దీవులు, మయన్మార్, ఒమన్, పాకిస్థాన్, ఖతార్, సౌదీ అరేబియా, శ్రీలంక, థాయిలాండ్, యూఏఈ, యెమెన్ దేశాలు తుఫాన్లకు పేర్లు పెడుతాయి. కొన్ని తుఫానుల ప్రభావం చాలారోజులు ఉంటుంది. అదే సమయంలో మరో తుఫాను వస్తే ఎక్కడ ఏ తుఫాను ప్రభావం అనే విషయంలో తికమక లేకుండా ఉండటం కోసం తుఫానులకు పేర్లుపెట్టే సంప్రదాయాన్ని ప్రారంభించారు.
తాజా తుఫానుకు ‘శక్తి’ అనే పేరును శ్రీలంక పెట్టింది. తుఫానులకు పేర్లు పెట్టడం ద్వారా డిజాస్టర్ మేనేజ్మెంట్కు, మీడియాకు, సాధారణ ప్రజలకు ఇది ఫలానా తుఫాను చెప్పడం, అర్థం చేసుకోవడం సులువు అవుగుంది. అయితే తుఫానులకు పెట్టే పేర్లు వీలయినంత చిన్నగా.. సులభంగా పలికే విధంగా ఉండాలనే నిబంధన ఉన్నది.
కాగా ప్రపంచవ్యాప్తంగా ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాలు, నాలుగు ప్రాంతీయ ఉష్ణమండల తుఫాను హెచ్చరిక కేంద్రాలు ఉన్నాయి. ఈ కేంద్రాలు తుఫానులకు సంబంధించి సూచనలు, సమాచారం ఇస్తుంటాయి. ఆరు ప్రాంతీయ ప్రత్యేక వాతావరణ కేంద్రాల్లో భారత వాతావరణ కేంద్రం కూడా ఒకటిగా పనిచేస్తోంది.
అక్షర క్రమాన్ని అనుసరించి ఒక్కో దేశం ఒక్కో తుఫానుకు పేరును సూచిస్తాయి. ప్రతిసారి ఆ పేరు కొత్తగా, మళ్లీ పునరావృతం కాకుండా ఉండాల్సి ఉంటుంది. తుఫానులకు పేర్లు పెట్టే విషయంలో పలు నిబంధనలు ఉన్నాయి. ‘తుఫాను పేరు 8 అక్షరాలకు మించరాదు. అది ఏ సభ్య దేశానికీ అభ్యంతరకరంగా ఉండకూడదు. ఏ వర్గం ప్రజల మనోభావాలను దెబ్బతీయకూడదు’ అనేవి ప్రధాన నిబంధనలుగా ఉన్నాయి.