చెన్నై, నవంబర్ 30 : ‘ఫెంగల్’ తుఫాను ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరిలో శనివారం భారీ వర్షాలు కురిశాయి. చెన్నై నగరంలో కుండపోత వర్షం పడింది. అనేక కాలనీలు, రోడ్లు జలమయమయ్యాయి. దీంతో నగరంలో జనజీవనం స్తంభించిపోయింది. తిరువల్లూర్, కాంచీపురం, కళ్లకురిచి, కడలోర్ జిల్లాల్లోనూ భారీగా వర్షాలు పడ్డాయి. ఈ జిల్లాల్లో స్కూళ్లు, కళాశాలలను మూసివేశారు. తుఫాను కారణంగా గంటకు 80 – 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచాయి. దీంతో శనివారం మధ్యాహ్నం 12.30 నుంచి ఆదివారం ఉదయం 4 గంటల వరకు చెన్నై విమానాశ్రయంలో కార్యకలాపాలన్నీ నిలిపివేశారు. చెన్నైకు రావాల్సిన విమానాలను బెంగళూరుకు దారి మళ్లించారు. లోకల్ రైళ్ల సేవలకు సైతం అంతరాయం కలిగింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో తమిళనాడులోని ఏడు జిల్లాల్లో రెడ్ అలర్ట్, 10 జిల్లాల్లో ఆరెంజ్ అలెర్ట్ జారీ చేశారు. తుఫాను ప్రభావిత జిల్లాల కలెక్టర్లతో సీఎం స్టాలిన్ సమీక్ష నిర్వహించి.. అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. కాగా, తుఫాను ప్రభావంతో ఆదివారం కూడా తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంతంలో భారీ వర్షపాతం నమోదవుతుందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది..
చెన్నైలో వర్షాల కారణంగా విద్యుత్ షాక్కు ఓ వ్యక్తి బలయ్యాడు. డబ్బులు డ్రా చేయడానికి అతడు ఏటీఎంకు వెళ్లగా, అప్పటికే అందులో వరద నీరు నిలిచింది. నీటిలోకి వెళ్లగానే అతడు కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే మరణించాడు. వర్షపు నీటిలో మృతదేహం తేలుతూ ఉండటాన్ని స్థానికులు గుర్తించారు.