Cyclonic Fengal | బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ఫెంగల్ పుదుచ్చేరి, మహాబలిపురం దగ్గరలో శనివారం రాత్రి తీరం దాటిందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. తుఫాను పూర్తిగా తీరం దాటడానికి మరికొంత సమయం పడుతుందని తెలిపింది. ప్రస్తుతం తుఫాను అత్యంత నెమ్మదిగా కదులుతున్నదని.. గడిచిన ఆరు గంటల్లో గంటకు 7 కిలోమీటర్ల వేగంతో కదిలినట్లుగా పేర్కొంది. పూర్తిగా తీరం పైకి వచ్చి తర్వాత బలహీనపడే అవకాశం ఉందని.. రాత్రి 11.30 గంటల సమయానికి తీవ్ర వాయుగుండంగా బలహీనపడే ఛాన్స్ ఉందని పేర్కొంది. తుఫాను తీరం దాటుతున్న నేపథ్యంలో తమిళనాడుతో పాటు ఏపీలో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి.
పలుచోట్ల ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. దక్షిణకోస్తా, రాయలసీమలో కొన్నిచోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు, మరికొన్ని చోట్ల అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పింది. నెల్లూరు, చిత్తూరు, కడప జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉందని.. లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సంస్థ ఎండీ కూర్మనాథ్ హెచ్చరించారు. ఇదిలా ఉండగా.. తుఫాను ప్రభావంతో చెన్నైలో వర్షాలు కొనసాగుతున్నాయి. చెన్నై విమానాన్ని తాత్కాలికంగా మూసివేయగా.. పలు విమానాలు రద్దయ్యాయి. వర్షాలతో హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నై మధ్య నడవాల్సిన విమానాలను ఎయిర్లైన్స్ సంస్థలు రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నాయి.