Cyclone Biparjoy | బిపర్జాయ్ తుఫాను గుజరాత్ తీరాన్ని తాకింది. కచ్ తీర ప్రాంతంలోని కోట్ లఖ్‌పత్ సమీపంలో తుఫాన్ తీరాన్ని తాకినట్లు భారత వాతావరణ శాఖ ( ఐఎండీ) వెల్లడించింది. దీని ప్రభావంతో గుజరాత్‌లోని తీర ప్రాంతాల్లో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. ఈ తుఫాను తీరం దాటేందుకు దాదాపు 6 గంటల సమయం పడుతుందని ఐఎండీ వెల్లడించింది. అర్ధరాత్రి 11:30 గంటల సమయంలో తీరం దాటే అవకాశం ఉందని అంచనా వేసింది. ప్రస్తుతం గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయని.. తీరం దాటే సమయానికి 120 నుంచి 130 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని పేర్కొంది. దీని కారణంగా కచ్, పోర్బందర్, రాజ్‌కోట్, మోర్బీ, జునాగఢ్, సౌరాష్ట్ర, ఉత్తర గుజరాత్ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తుఫాను ప్రభావంతో అరేబియా సముద్రంలో అల్లకల్లోలం ఏర్పడింది. ద్వారక, పోర్బందర్, జామ్‌నగర్, మోర్బి తీర ప్రాంతాల్లో 6 మీటర్ల మేర రాకాసి అలలు ఎగసిపడుతున్నాయి. తీరప్రాంతాల్లోని లోతట్టు ప్రాంతాలకు సముద్రపు నీరు కూడా చేరిందని తెలిపింది. తుఫాను తీవ్రత కారణంగా అధికారులు అప్రమత్తమయ్యారు. సహాయక చర్యలు చేపట్టి దాదాపు లక్షమందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. తుఫాను తీరం దాటే పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ విధించారు. తుఫాను హెచ్చరికలతో దేవభూమి ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయాన్ని మూసివేశారు. దీంతో పాటు ఆయా ప్రాంతాల్లోని ఆలయాలు, పాఠశాలలు, ప్రభుత్వ ఆఫీసులను తాత్కాలికంగా మూసివేశారు.
#WATCH | Gujarat | Heavy rainfall, accompanied by strong winds, continues in Morbi as an impact of #CycloneBiparjoy.
The landfall process has commenced over the coastal districts of Saurashtra and Kutch and it will continue until midnight, says IMD pic.twitter.com/xzIFwCxP1U
— ANI (@ANI) June 15, 2023
కాగా, బిపర్జాయ్ తుఫాను నేపథ్యంలో ఇప్పటికే 70 గ్రామాలకు చెందిన 75 వేల మంది ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. త్రివిధ దళాలు సహా ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాయని గుజరాత్ ప్రభుత్వం వెల్లడించింది. గాలుల వేగం పెరగడంతో తీర ప్రాంతాల్లో 4 వేల హోర్డింగులను తొలగించినట్టు అధికారులు వెల్లడించారు. తుఫాను తీవ్రత అధికంగా ఉంటుందని ప్రజలు ఇండ్ల నుంచి బయటకు రావద్దని.. ప్రభుత్వం జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని ఎన్డీఆర్ఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ నిఖిల్ ముధోలకర్ విజ్ఞప్తి చేశారు. తీర ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల్లో పరిస్థితి సమీక్షిస్తున్నామని.. ఆయా ప్రాంతాల్లోని సైనిక బలగాలను మోహరించామని తెలిపారు.
బిపర్జాయ్ తుఫాను ఈ నెల 16న రాజస్థాన్‌పైనా ప్రభావం చూపనుందని ఐఎమ్‌డీ వెల్లడించింది. మరోవైపు తుఫాను తమ జీవనోపాధిపై ప్రభావం చూపవచ్చని నౌకల తయారీదారులు ఆందోళన చెందుతున్నారు. తీర ప్రాంతంలోనే నౌకలను తయారు చేస్తామని, 3 వేల టన్నుల బరువుండే చెక్క నౌకల తయారీకి రెండేండ్లు పడుతుందని, వాటిని ఇప్పుడు సురక్షిత ప్రాంతాలకు తరలించలేమని వారు వాపోతున్నారు.