న్యూఢిల్లీ: నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో(National Crime Records Bureau) 2023 నేరాల రిపోర్టును రిలీజ్ చేసింది. దేశంలో 2023లో 27,721 మర్డర్ కేసులు నమోదు అయినట్లు ఆ నివేదిక పేర్కొన్నది. 2022తో పోలిస్తే ఇది 2.8 శాతం తక్కువ అని తెలిసింది. అయితే ఎస్టీలపై నేరాలు పెరిగినట్లు ఎన్సీఆర్బీ ఆందోళన వ్యక్తం చేసింది. ఆ ఏడాదిలో ఎస్టీలపై 28 శాతం నేరాల సంఖ్య పెరిగినట్లు చెప్పింది. ఇక సైబర్ నేరాల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది.
2023లో సైబర్ నేరాల సంఖ్య 31.2 శాతం పెరిగినట్లు రిపోర్టులో పేర్కొన్నారు. ఆ ఏడాది 86,420 సైబర్ నేరాలు నమోదు అయ్యాయి. 2022లో ఆ సంఖ్య 65,893గా ఉంది. 2022లో దేశవ్యాప్తంగా 28,522 మర్డర్ కేసులు నమోదు అయినట్లు ఎన్సీఆర్బీ రిపోర్టులో పేర్కొన్నారు. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి లక్ష మంది జనాభా ఆధారంగా నేరాల రేటును విశ్లేషిస్తారు.
దేశంలో జువినైల్ నేరాల సంఖ్య కూడా పెరిగింది. 2023లో దేశవ్యాప్తంగా 31,365 జువినైల్ కేసులు నమోదు అయ్యాయి. 2022తో పోలిస్తే ఆ కేసుల సంఖ్య 2.7 శాతం పెరిగినట్లు తెలుస్తోంది. ఢిల్లీలో జువినైల్ క్రైం అత్యధికంగా ఉన్నది. దేశవ్యాప్తంగా 2022లో 6.9గా ఉన్న జువినైల్ నేరాలు సంఖ్య 2023లో 7.1 శాతానికి పెరిగినట్లు ఎన్సీఆర్బీ డేటా పేర్కొన్నది.