CWC meeting : కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ కమిటీ (Congress Working Committee – CWC) సమావేశమైంది. దేశ రాజధాని ఢిల్లీలోని ఏఐసీసీ (All India Congress Committee – AICC) హెడ్ క్వార్టర్స్‌లో ఈ సమావేశం జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే (Mallikarjun Kharge), లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ (Rahul Gandhi) సమక్షంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులంతా హాజరయ్యారు.
వారిలో పీ చిదంబరం, జైరామ్ రమేశ్, శశిథరూర్, అజయ్ మాకెన్, రాజీవ్ శుక్లా, రణ్‌దీప్ సుర్జేవాలా, సచిన్ పైలట్, ప్రియాంకాగాంధీ తదితరులు ఉన్నారు. ఇటీవల జరిగిన మహారాష్ట్ర (Maharastra), హర్యానా (Haryana) అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయాలను మూటగట్టుకున్న నేపథ్యంలో ఆ పార్టీ వర్కింగ్ కమిటీ సమావేశమవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
మహారాష్ట్ర, హర్యానాల్లో గెలిచేందుకు మంచి అవకాశాలున్నా కాంగ్రెస్ పార్టీ ఓటమి పాలవడగానికి కారణాలు ఏమిటి..? లోపాలు ఎక్కడున్నాయ్..? అనే అంశాలు ఈ సమావేశంలో చర్చకు రానున్నట్లు తెలుస్తోంది. అదేవిధంగా దేశంలోని ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై కూడా సమావేశంలో చర్చించనున్నట్లు సమాచారం. కాగా హర్యానా, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు తమదేనన్న ధీమాతో బరిలో దిగిన కాంగ్రెస్.. ఫలితాలు భిన్నంగా రావడంతో ఖంగుతిన్నది.
హర్యానాలో అధికార బీజేపీకి వ్యతిరేక పవనాలు వీచినా.. ఆ పరిస్థితిని కాంగ్రెస్ పార్టీ తనకు అనుకూలంగా మార్చుకోలేకపోయింది. మహారాష్ట్రలో కూడా మహాయుతి కూటమిపై ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. కానీ ప్రతిపక్ష మహా వికాస్ అఘాడీ కూటమి దాన్ని తనకు అనుకూలంగా మలచుకోవడంలో విఫలమైంది. మహాయుతికే ప్రజలు మళ్లీ పట్టం కట్టారు.