న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తన అధికార నివాసం 6, ఫ్లాగ్‌స్టాఫ్ రోడ్డు బంగళా విస్తరణ, మరమ్మతులు, అలంకరణల కోసం అధికంగా ఖర్చు పెట్టారని వచ్చిన ఆరోపణలపై సమగ్ర దర్యాప్తు జరపాలని సీపీడబ్ల్యూడీని కేంద్ర విజిలెన్స్ కమిషన్ శనివారం ఆదేశించింది. అవినీతి జరిగినట్లు వచ్చిన ఆరోపణలతో ఆ బంగళాకు శీష్ మహల్ అని బీజేపీ పేరు పెట్టింది. 2015 నుంచి గత అక్టోబర్ వరకు ముఖ్యమంత్రిగా ఆ బంగళాలో అరవింద్ కేజ్రీవాల్ నివసించారు. బీజేపీ నాయకుడు విజేందర్ గుప్తా చేసిన ఫిర్యాదు, సీపీడబ్ల్యూడీ సమర్పించిన వాస్తవ నివేదికలను పరిగణనలోకి తీసుకున్న సీవీసీ ఇప్పుడు సమగ్ర దర్యాప్తు కోసం సీపీడబ్ల్యూడీని ఆదేశించింది.
‘జైన్‌పై ప్రాసిక్యూషన్ రాజకీయ కుట్ర’
తమ పార్టీ నేత సత్యేంద్ర జైన్‌ను విచారించడానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం రాష్ట్రపతిని కోరడం రాజకీయ, పార్టీ నిర్వీర్యానికి కుట్ర అని ఆప్ నేత, ఎంపీ సంజయ్ సింగ్ ఆరోపించారు.