న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల్లో (Central government employees) అత్యధికంగా అవినీతికి పాల్పడేవారు ఎవరో తెలుసా.. అమిత్ షా నేతృత్వంలోని హోం శాఖలో (Home ministry) పనిచేసేవారే. అవును.. ఈ విషయం చెప్పింది ఎవరో కాదు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (CVC). 2022లో అవినీతికి సంబంధించి వచ్చిన ఫిర్యాదుల్లో (Complaints) అత్యధికంగా ఆ మంత్రిత్వ శాఖలోనే ఉన్నాయని సీవీసీ నివేదిక స్పష్టం చేసింది. తర్వాత రైల్వే (Railway), బ్యాంకింగ్ (Banking) రంగంలో పనిచేసే ఉద్యోగులు ఉన్నారు.
కేంద్ర ప్రభుత్వంలోని అన్ని విభాగాలకు సంబంధించి గతేడాది 1,15,203 ఫిర్యాదులు వచ్చినట్లు సీవీసీ తెలిపింది. ఇందులో 85,437 ఫిర్యాదులను పరిష్కరించగా.. మరో 29,766 పెండింగులో ఉన్నాయని వెల్లడించింది. మరో 22,034 ఫిర్యాదులు మూడు నెలలకుపైగా అపరిష్కృతంగా ఉన్నాయని పేర్కొంది.
ఇక మొత్తం ఫిర్యాదుల్లో అత్యధికంగా హోం శాఖ ఉద్యుగులపై 46,643 ఉండగా, రైల్వేల్లో 10,850, బ్యాంకుల్లో 8,129 ఫిర్యాదులు వచ్చాయి. హోం శాఖ ఉద్యోగులకు సంబంధించిన 23,919 ఫిర్యాదులను పరిష్కరించగా, 22,724 పెండింగ్‌లో ఉన్నాయని, మరో 19,198 ఫిర్యాదులు మూడు నెలలకుపైగా అపరిష్కృతంగా ఉన్నాయని తెలిపింది.
ఇక బొగ్గు గనుల శాఖ ఉద్యోగులపై 4,304 ఫిర్యాదులు రాగా, కార్మిక శాఖలో 4,236, పెట్రోలియం శాఖ ఉద్యోగులపై 2,617, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డులో 2150, రక్షణ శాఖ ఉద్యోగులపై 1308, టెలికమ్యూనికేషన్స్‌లో 1202, ఆర్థికశాఖలో 1101 చొప్పున ఫిర్యాదులు అందాయని తన వార్షిక నివేదికలో సీవీసీ పేర్కొన్నది. ఉద్యోగులపై వచ్చే ఫిర్యాదులను మూడు నెలల్లోగా పరిష్కరించాలనే నిబంధన ఉన్నది.