న్యూఢిల్లీ: ప్రపంచవ్యాప్తంగా క్రిప్టోకరెన్సీ చెలామణిలోకి వస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీ తొలిసారి ఆ అంశంపై తన అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. చెడ్డవారి చేతుల్లోకి క్రిప్టో కరెన్సీ వెళ్లకుండా ప్రపంచంలోని అన్ని ప్రజాస్వామ్య దేశాలు కలిసి ఓ నిర్ణయం తీసుకోవాలన్నారు. డిజిటల్ కరెన్సీపై ఇండియా ఇంకా ఎటువంటి నిర్ణయాన్ని తీసుకోలేదు. కానీ క్రిప్టో వల్ల యువత చెడిపోయే ప్రమాదం ఉందని మోదీ అభిప్రాయపడ్డారు. ద సిడ్నీ డయలాగ్ సదస్సులో పాల్గొన్న ఆయన కీలకోపన్యాసం చేశారు. భారత్‌లో క్రిప్టోపై ఎలా ముందుకు వెళ్లాలని ఇటీవల మోదీ.. బ్యాంకింగ్ అధికారులతో చర్చలు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన వార్నింగ్ సందేశం ఇచ్చారు. మనీల్యాండరింగ్‌కు, టెర్రర్ ఫైనాన్సింగ్‌కు క్రిప్టోమార్కెట్లకు వేదికగా మారుతున్నట్లు ప్రధాని ఆందోళన వ్యక్తం చేశారు.
టెక్నాలజీ, డేటాలు ఇప్పుడు కొత్త ఆయుధాలుగా మారుతున్నాయని, అందుకే డేటా గవర్నెన్స్‌లో ప్రజాస్వామ్య దేశాలు సహకరించుకోవాలన్నారు. క్రిప్టోకరెన్సీ లేడా బిట్‌కాయిన్ గురించి ప్రస్తావిస్తే, అన్ని ప్రజాస్వామ్య దేశాలు ఈ అంశంపై కలిసి పనిచేయాలని, క్రిప్టోలు చెడ్డవారి చేతుల్లోకి వెళ్లకుండా చూడాలని, ఎందుకుంటే అది మన యువతను నాశనం చేసే అవకాశం ఉన్నట్లు మోదీ హెచ్చరించారు. క్రిప్టో పెట్టుబడుల విషయంలో భారత ప్రభుత్వం మార్గదర్శకాలను రూపొందిస్తున్నట్లు తెలుస్తోంది. డిజిటల్ యుగం మనం చుట్టు ఉన్న అన్నింటినీ మార్చేస్తోందని, రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థ, సమాజం అన్ని మారిపోయినట్లు మోదీ తెలిపారు. సౌభ్రాతృత్వం, పరిపాలన, నీతి, చట్టాలు, హక్కులు, భద్రత అన్నింటిపై డిజిటల్ ప్రభావం పడినట్లు ప్రధాని తెలిపారు. డిజిటలైజేషన్‌తో అంతర్జాతీయ పోటీతత్వంలోనూ మార్పు వచ్చిందన్నారు.