న్యూఢిల్లీ, అక్టోబర్ 27: రష్యా నుంచి చమురు దిగుమతులను నిలిపివేయాలంటూ డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం చేస్తున్న బెదిరింపులకు భారత్ లొంగిపోయినట్లు కనపడుతోంది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును నిలిపివేయని పక్షంలో భారీ సుంకాల మోత కొనసాగుతుందంటూ ట్రంప్ చేస్తున్న హెచ్చరికలకు కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం తలొగ్గినట్లు తాజా పరిణామాలు సూచిస్తున్నాయి. రష్యా నుంచి చమురు దిగుమతిని నిలిపివేస్తానంటూ ప్రధాని మోదీ తనకు హామీ ఇచ్చారని పదేపదే చేసిన ప్రకటనలను ఖండించిన బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ట్రంప్‌కు ఇచ్చిన మాట నిలుపుకుంటున్నట్లు స్పష్టమైన సంకేతాలు అందుతున్నాయి. రష్యా నుంచి చమురు కొనుగోలును భారత్ పూర్తిగా నిలిపివేసినట్లు ప్రభుత్వం అధికారికంగా అందచేసిన వివరాలు వెల్లడిస్తున్నాయి.
రష్యా నుంచి ముడి చమురు దిగుమతులను నిలిపివేసినట్లు ఫెడరల్ అనే మీడియా సంస్థ సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ) కింద అడిగిన ప్రశ్నకు ప్రభుత్వ రంగానికి చెందిన హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌పీసీఎల్) సమాధానమిచ్చింది. ఈ ఏడాది ఆగస్టులో రష్యా నుంచి ఒక్క చుక్క చమురును కూడా దిగుమతి చేసుకోలేదని హెచ్‌పీసీఎల్ జవాబిచ్చింది. అయితే అమెరికా ఒత్తిళ్లకు నరేంద్ర మోదీ ప్రభుత్వం లొంగిపోయిందని విపక్షాలు చేస్తున్న ఆరోపణలను ఖండిస్తూ వస్తున్న విదేశీ వ్యవహారాల శాఖ అధికారుల వాదనకు ఆర్టీఐ జవాబుకు పొంతనలేకుండా ఉంది.
2022 సెప్టెంబర్ నుంచి 2025 సెప్టెంబర్ వరకు రష్యా నుంచి భారత ప్రభుత్వం దిగుమతి చేసుకున్న ముడి చమురు నెలవారీ వివరాలను తెలియచేయాలని ఫెడరల్ ఆర్టీఐ కింద కోరింది. దీనికి హెచ్‌పీసీఎల్ మాత్రమే జవాబివ్వగా ఇతర ప్రభుత్వ రంగ చమురు కంపెనీలు మాత్రం గోప్యతా నిబంధనలను సాకుగా చూపుతూ వివరాలు వెల్లడించడానికి నిరాకరించాయి. హెచ్‌పీసీఎల్ ఇచ్చిన వివరాల ప్రకారం 2022 ఏప్రిల్ నుంచి 2025 జూలై వరకు కంపెనీ నిరంతరంగా ముడి చమరును రష్యా నుంచి దిగుమతి చేసుకుంది. 2025 ఫిబ్రవరిలో అత్యంత తక్కువగా 131 టీఎంటీ(వేల మెట్రిక్ టన్నులు) ముడి చమురును దిగుమతి చేసుకోగా 2024 అక్టోబర్‌లో అత్యంత అధికంగా 1,146 టీఎంటీ దిగుమతి చేసుకుంది. అయితే 2022 ఆగస్టు, 2022 అక్టోబర్‌లో మాత్రం సున్నా దిగుమతి చూపించింది. అదే విధంగా 2025 ఆగస్టులో సున్నా దిగుమతులు చూపించింది.
భారీ సుంకాల ప్రభావం
భారత్‌పై అమెరికా భారీ సుంకాలు విధించిన తర్వాత ఈ విధంగా సున్నా దిగుమతి జరగడం గమనార్హం. రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన తర్వాత 2022 జనవరి-మార్చి తొలి త్రైమాసికంలో రష్యా నుంచి హెచ్‌పీసీఎల్ చమురును దిగుమతి చేసుకోలేదు. అయితే ఆ తర్వాత నుంచి రష్యా చమురు దిగుమతులు క్రమంగా పెరుగుతూ పోయాయి. 2024 ఆర్థిక సంవత్సరంలో హెచ్‌పీసీఎల్ శుద్ధి చేసిన మొత్తం ముడి చమురులో రష్యా ముడి చమురు 13 శాతం ఉంటుంది.
జవాబు ఇవ్వని ఇతర కంపెనీలు..
ఆర్టీఐ కింద ఇతర ప్రభుత్వ రంగ చమురు కంపెనీలైన ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్(ఐఓసీఎల్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(బీపీసీఎల్), ఓఎన్జీసీకి చెందిన మంగళూరు రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్స్ లిమెటెడ్(ఎంఆర్‌పీఎల్)ని కూడా రష్యా నుంచి జరిగిన చమురు దిగుమతుల వివరాలను ఫెడరల్ కోరగా గోప్యతా నిబంధనలను సాకుగా చూపుతూ ఆ కంపెనీలు సమాచారం ఇవ్వడానికి నిరాకరించాయి. ప్రైవేట్ సంస్థ అయినందున రిలయన్స్‌కు ఆర్టీఐ నుంచి మినహాయింపు ఉంది.