లక్నో: నదీ తీరానికి వెళ్లిన ఒక బాలుడిపై మొసలి దాడి చేసింది. అతడ్ని నోటకరుచుకుని నీటిలోకి లాక్కెళ్లింది. పోలీసులు, అటవీ శాఖ సిబ్బంది ఆ నీటిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు బాలుడి మృతదేహాన్ని వెలికితీశారు. (Crocodile Attacks boy) ఉత్తరప్రదేశ్లోని బహ్రైచ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. జూలై 14న 12 ఏళ్ల బాలుడు తన మేనమామతో కలిసి ఘఘ్రా నది సమీపంలోని పొలానికి చేరుకున్నాడు. కొంత సమయం తర్వాత మల విసర్జన కోసం నది ఒడ్డుకు వెళ్లాడు.
కాగా, నది తీరంలో మాటు వేసి ఉన్న మొసలి ఆ బాలుడిపై దాడి చేసింది. అతడి అరుపులు విన్న మేనమామ నది ఒడ్డుకు పరుగున వచ్చాడు. ఆ బాలుడ్ని రక్షించేందుకు ప్రయత్నించాడు. అయితే మొసలి అతడ్ని నోటకరుచుకుని నదిలోకి లాక్కెళ్లి నీటిలో మాయమైంది.
మరోవైపు ఇది తెలుసుకున్న స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు, బహ్రైచ్ అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. దీంతో వారు అక్కడకు చేరుకుని నదిలో గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు సాయంత్రం వేళ బాలుడి మృతదేహాన్ని గుర్తించి వెలికితీశారు. ఈ సంఘటనపై స్థానికులు భయాందోళన చెందారు.