న్యూఢిల్లీ : కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అండర్గ్రాడ్యుయేట్స్ (సీయూఈటీ-యూజీ), 2025 పరీక్ష కేంద్రాల కేటాయింపుపై విద్యార్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతున్నది. ఢిల్లీ-ఎన్సీఆర్, మీరట్, పరిసర ప్రాంతాల విద్యార్థులకు దాదాపు 100 కి.మీ. దూరంలోని డెహ్రాడూన్, ముజఫర్నగర్ వంటి చోట్ల పరీక్ష కేంద్రాలను కేటాయించారు. మూడో ప్రాధాన్యం కింద ఎంచుకున్న పరీక్ష కేంద్రాలను కేటాయించడం పట్ల విద్యార్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
దీనివల్ల విద్యార్థుల భద్రత, ఆయా కేంద్రాలకు వెళ్లగలగడం మాత్రమే కాకుండా మానసిక ఒత్తిడి, శ్రమను కూడా అనుభవించవలసి ఉంటుందని వాపోతున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నిర్వహణ లోపం వల్ల ఈ సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నదని మండిపడుతున్నారు.