RVM | వచ్చే ఏడాది ఎన్నికల్లో ఆర్వీఎంలతో ఓటింగ్‌కి ఈసీ ప్లాన్.. అసలేంటి ఈ మెషిన్ స్పెషాలిటీ?
RVM | దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
RVM | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, మార్చి 28 (నమస్తే తెలంగాణ): దేశంలో ఇప్పటికే వినియోగంలో ఉన్న ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల (ఈవీఎం) పనితీరు, విశ్వసనీయతపై సాధారణ పౌరులే కాదు మేధావులు కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ, ఎన్నికల సంఘం (ఈసీ) రానున్న లోక్‌సభ ఎన్నికల్లో రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్లను (ఆర్వీఎం) ప్రవేశపెట్టాలని యోచిస్తున్నది. దీనిపై చర్చించేందుకు గత జనవరి 16న దేశంలోని ఎనిమిది జాతీయ, 57 రాష్ట్రీయ రాజకీయ పార్టీ నేతలను ఆహ్వానించింది. అయితే, ఎన్నికల్లో ఆర్వీఎంలను తీసుకురావడాన్ని మెజార్టీ విపక్షాలు వ్యతిరేకించాయి. రిమోట్ ఓటింగ్‌కు సంబంధించి తమ అనుమానాలకు ఈసీ జవాబివ్వాలని విజ్ఞప్తి చేశాయి.
ఏమిటీ ఆర్వీఎం?
దేశంలో వివిధ ప్రాంతాలకు వలస వెళ్లినవారు తాము ఎక్కడుంటే అక్కడి నుంచే ఓటు హక్కును వినియోగించుకునేందుకు సాయపడే ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రమే ఆర్వీఎం. ఒకే పోలింగ్ బూత్ నుంచి 72 నియోజకవర్గాల్లో ఓటు హక్కుని వినియోగించుకునేలా ఈసీ ఆర్వీఎం ప్రొటోటైప్‌ను ఇప్పటికే అభివృద్ధి చేసింది.
ఆర్వీఎం తేవడానికి ఈసీ చెబుతున్న కారణమేంటి?
2019 లోక్‌సభ ఎన్నికల్లో 67.4 శాతం ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, దాదాపు 30 కోట్ల మంది ఓటింగ్‌కు దూరమయ్యారని ఈసీ తెలిపింది. సొంత నియోజకవర్గంలో కాకుండా వేర్వేరు ప్రాంతాల్లో ఓటర్లు ఉండటమే దీనికి కారణంగా పేర్కొంది. దూరప్రాంతాల్లో ఉన్న ఓటర్లు కూడా తమ నియోజకవర్గంలో జరిగే ఎన్నికల్లో రిమోట్ లొకేషన్ నుంచే పోలింగ్‌లో పాల్గొనేందుకు ఈ యంత్రాన్ని తీసుకొస్తున్నట్టు వెల్లడించింది.
ఆర్వీఎం ద్వారా ఓటింగ్ ఎలా జరుగుతుందంటే?
- సొంతూరును విడిచి వేరొక ఊరికి లేదా రాష్ర్టానికి వలస వెళ్లిన ఓటరు తమ నియోజకవర్గంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలైన తర్వాత తనకు తన సొంత నియోజకవర్గంలో రిమోట్ ఓటింగ్‌కు అవకాశం కల్పించాలని కోరుతూ ఎన్నికల సంఘానికి ముందుగా అర్జీ పెట్టుకోవాలి.
- అధికారులు సూచించిన ఫార్మాట్లో (ఆన్లైన్ లేదా ఆఫ్‌లైన్ ) ఓటరు వివరాలను నమోదు చేయాలి.
- ఓటరు అభ్యర్థనను పరిగణనలోకి తీసుకుని వెరిఫికేషన్ పూర్తిచేసిన తర్వాత ఈసీ ఆ వ్యక్తిని రిమోట్ ఓటరుగా గుర్తిస్తుంది.
- సదరు వ్యక్తి ఉంటున్న ప్రాంతంలో రిమోట్ ఓటింగ్ బూత్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ బూత్‌లోనే ఓటరు ఓటు హక్కు వినియోగించుకోవచ్చు.
ప్రతిపక్షాల అభ్యంతరాలు?
- ఆర్వీఎంను మ్యాన్యువల్‌గా బూత్‌లోని సిబ్బంది డాటాను యాక్సెస్ చేసే ప్రమాదం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.
- ఆర్వీఎంలో ఏదైనా సాంకేతిక లోపం జరిగితే దాని ప్రభావం 72 నియోజక వర్గాలపై పడుతుంది.
- ఈవీఎంలను సులభంగా హ్యాకింగ్ చేయవచ్చని ఇప్పటికే పలు విమర్శలున్నాయి. ఎక్కడో రిమోట్ లొకేషన్ నుంచి ఆర్వీఎంను ఆపరేట్ చేస్తున్నప్పుడు హ్యాకింగ్ జరుగదన్న గ్యారెంటీ ఏమిటన్న ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి.
- రిమోట్ ఓటింగ్‌లో గోప్యత, ఓటర్ల గుర్తింపు, పోలింగ్ ఏజెంట్ల లభ్యత, కౌంటింగ్ వంటి పనులు పారదర్శకంగా జరుగుతాయా? అని విపక్షాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి.
చట్ట సవరణ అవసరం
రిమోట్ ఓటింగ్ వ్యవస్థను అమల్లోకి తీసుకురావాలంటే పెద్ద ప్రక్రియను అమలు చేయాల్సి ఉంటుంది. ఇందుకు ప్రజాప్రాతినిథ్య చట్టం-1950, 1951, ఎన్నికల నిర్వహణ నిబంధనలు-1961, ఓటర్ల నమోదు నిబంధనలు-1960 చట్టాల్లో మార్పు చేయాల్సి ఉంటుంది.
తెచ్చాయి.. వద్దనుకొన్నాయి
రిమోట్ ఓటింగ్ వ్యవస్థను తొలిసారిగా ఎస్తోనియా 2005లో అందుబాటులోకి తీసుకొచ్చింది. అనంతరం స్విట్జర్లాండ్, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్ కూడా రిమోట్ ఓటింగ్‌ను అమల్లోకి తీసుకొచ్చాయి. అయితే గోప్యత, భద్రతాపరమైన సవాళ్లను ఎదుర్కోలేకపోవడం, పౌరులు, విపక్షాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో రిమోట్ ఓటింగ్నుఉపసంహరించుకొన్నాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- elections
- evm
- Remote Voting
- rvm
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

