భోపాల్, ఆగస్టు 2: వారసత్వ రాజకీయాలపై బీజేపీ నేతలు చెప్పే బడాయి మాటలు డొల్ల అని ఇప్పటికే పలు సందర్భాల్లో తేలింది. మధ్యప్రదేశ్‌లో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మరోసారి తేటతెల్లమైంది. పార్టీకి చెందిన ప్రస్తుత, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల కుటుంబసభ్యులు గణనీయ సంఖ్యలో జిల్లా, జనపద్ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేశారు. మున్సిపాలిటీల ఎన్నికల్లోనూ బరిలోకి దిగారు. పోటీచేసిన, గెలిచిన వారి జాబితాలో బీజేపీ నేతల కుటుంబసభ్యుల పేర్లు ఉన్నాయి.
దిగిపోతూ భార్యకే పదవి..
ఖండ్వా మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ అభ్యర్థిగా బీజేపీ తరపున అమృత పోటీచేసి గెలిచారు. ఈమె మూడుసార్లు ఎమ్మెల్యేగా చేసిన హకుమ్చంద్ యాదవ్‌కు కోడలు. అమృత ఖండ్వా మున్సిపాలిటీకి ఇప్పటివరకు చైర్‌పర్సన్‌గా ఉన్న అమర్ యాదవ్ భార్య. వింధ్య రీజియన్‌లోని సత్నాలో మేయర్‌గా గెలిచిన యోగేశ్ తామ్రాకర్ ఆరెస్సెస్ సీనియర్ నేత శంకర్ ప్రసాద్ కుమారుడు. సాగర్ పట్టణం కొత్త మేయర్‌గా బీజేపీ నేత సుశీల్ తివారీ భార్య సంగీత ఎన్నికయ్యారు. సుశీల్ తివారీ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు బీజేపీలో చేరారు. ఇదే సుశీల్‌కు మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్‌కు సన్నిహితుడిగా, మంత్రి భూపేందర్ సింగ్‌కు విధేయుడిగా పేరున్నది.
టీకంగఢ్‌లో ఉమాభారతి కుటుంబసభ్యులు..
ఇటీవల జరిగిన 51 జిల్లా పరిషత్ చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికల్లో కూడా బీజేపీ నేతల కుటుంబసభ్యులు గణనీయ సంఖ్యలో పోటీచేశారు. టీకంగఢ్ జిల్లాలో బీజేపీ మద్దతు పలికిన ఉమితా సింగ్ స్థానిక ఎమ్మెల్యే రాహుల్ సింగ్ లోధి భార్య. ఈ రాహుల్ సింగ్ మాజీ సీఎం ఉమాభారతి అల్లుడు.. ఈ పరంపర బీజేపీలో వారసత్వ రాజకీయాలకు సాక్ష్యంగా నిలుస్తున్నది. టీకంగఢ్ పొరుగు జిల్లా సాగర్‌లో కేంద్ర మంత్రి జ్యోతారాధిత్య సింధియా విధేయుడు రాష్ట్ర మంత్రి గోవింద్ సింగ్ రాజ్‌పుత్ సోదరుడు హిరాసింగ్ జిల్లా పరిషత్ చైర్‌పర్సన్‌గా పోటీచేసి గెలిచారు.