కోల్కతా: రాజకీయ కన్సల్టన్సీ సంస్థ ఐ-ప్యాక్ కార్యాలయాలపై ఈడీ దాడుల సందర్భంగా పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ వెంట చీఫ్ సెక్రటరీ నందినీ చక్రవర్తి, ప్రిన్సిపల్ సెక్రటరీ మనోజ్ పంత్ వెళ్లడం వివాదాస్పదమైంది. ఈ ఇద్దరు ఐఏఎస్ అధికారుల చర్యను తీవ్ర దుష్ప్రవర్తనగా సీనియర్ అధికారులు, రాజకీయ నేతలు అభివర్ణించారు. తృణమూల్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా తాను అక్కడికి వెళ్లానని ముఖ్యమంత్రి మమత శుక్రవారం తన చర్యను సమర్థించుకోవడంతో వివాదం రాజుకున్నది.
భద్రతా ముప్పులు, శాంతి భద్రతల సమస్యలు ఉండే అవకాశం ఉన్నందున ముఖ్యమంత్రి పోలీసు అధికారులు ఎక్కడికైనా వెళ్లవచ్చని, కాని కేంద్ర దర్యాప్తు బృందం సోదాలు నిర్వహిస్తున్న సమయంలో ముఖ్యమంత్రి వెంట పాలనాధికారులు వెళ్లవలసిన అవసరం లేదని, అది తీవ్ర దుష్ప్రవర్తనగా పరిగణించాల్సి వస్తుందని రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేసిన ఓ మాజీ సీనియర్ అధికారి స్పష్టం చేశారు.