Crime news : వరకట్న దాహానికి రెండు నిండు ప్రాణాలు బలయ్యాయి. అత్తింటి వారి వరకట్న వేధింపులకు తాళలేక ఓ స్కూల్ టీచర్, తన మూడేళ్ల కుమార్తెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడింది. ఇంట్లో కుర్చిలో కూర్చుని ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. రాజస్థాన్‌లోని జోధ్‌పూర్ జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
వివరాల్లోకి వెళ్తే.. జోధ్‌పూర్ జిల్లాలోని డంగియవాజ్ పోలీస్‌స్టేషన్ పరిధిలోగల సర్నాడ గ్రామంలో దిలీప్ బిష్ణోయ్, సంజూ బిష్ణోయ్ ఇద్దరూ దంపతులు. వీరికి యశస్వి అనే మూడేళ్ల కుమార్తె ఉంది. అయితే సంజూ బిష్ణోయ్‌ని గత కొంతకాలంగా ఆమె భర్త, అత్తింటి వారు వేధింపులకు గురిచేస్తున్నారు. దాంతో ఆమె బాగా విసిగిపోయింది.
ఈ క్రమంలో శుక్రవారం స్కూల్ నుంచి రాగానే సూసైడ్ నోట్ రాసి ఆత్మహత్యకు పాల్పడింది. ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పంటించుకుంది. ఈ ఘటనలో చిన్నారి అక్కడికక్కడే మరణించగా, సంజూ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతిచెందింది. తన ఆత్మహత్యకు తన భర్త, అత్తమామలు, ఆడపడుచే కారణమని ఆమె సూసైడ్ నోట్లో పేర్కొంది.
అత్తింటివాళ్లు నిత్యం తనను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నారని నోట్లో రాసిపెట్టింది. తన భర్త దిలీప్, గణపత్ సింగ్ అనే మరో వ్యక్తితో కలిసి తరచూ శారీరకంగా హింసిస్తున్నాడని పేర్కొంది. ఆ సూసైడ్ నోట్ ఆధారంగా పోలీసులు మృతురాలి భర్త, అత్తమామలను అరెస్ట్ చేశారు. గణపత్‌సింగ్ అనే వ్యక్తి కోసం గాలిస్తున్నారు.