Crime news : ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడాలో దారుణం జరిగింది. జైలు నుంచి విడుదలైన భర్తకు భయపడి ఓ మహిళ తన ఇద్దరు పిల్లలను చంపేసింది. ఆ తర్వాత తాను ఆత్మహత్యకు ప్రయత్నించింది. కానీ ఇంతలో స్థానికులు అడ్డుకోవడంతో బతికిపోయింది. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా ప్రాంతానికి చేరుకున్న పోలీసులు.. నిందితురాలి అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. నోయిడాకు చెందిన సదరు మహిళ ముందుగా ఒక ముస్లిం వ్యక్తిని వివాహం చేసుకుంది. వారికి ఒక కొడుకు, ఒక పాప ఉన్నారు. అయితే హత్య కేసులో భర్త జైలుకు వెళ్లడంతో ఆమెకు పిల్లల పోషణ భారంగా మారింది. దాంతో ఒక హిందూ వ్యక్తితో సహజీనం ప్రారంభించింది. అతడితో ఒక బాబును కన్నది. ఈ క్రమంలో ఆమె మొదటి భర్త జైలు నుంచి విడుదలయ్యాడు.
భార్యను తన దగ్గరికి తిరిగి రావాలని హుకుం జారీచేశాడు. లేదంటే చంపేస్తానని బెదిరించాడు. అయితే అతని దగ్గరికి తిరిగి వెళ్లడం ఇష్టంలేక, వెళ్లకపోతే తనను, పిల్లలను చంపేస్తాడనే భయంతో ఆమె వణికిపోయింది. చివరికి పిల్లలను చంపేసి, తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. ముందుగా పిల్లలను గొంతు పిసికి చంపి, తాను ఉరేసుకోబోయింది. ఇంతలో గమనించిన స్థానికులు అడ్డుకున్నారు.
అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టానికి పంపించారు. తన రెండో భర్త పోషిస్తాడనే నమ్మకంతోనే మూడో బాబును వదిలేశానని పోలీసుల విచారణలో నిందితురాలు తెలిపింది. ఆమెను కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి రిమాండ్ విధించారు.