Crime news : సోషల్ మీడియా (Social Media) కొన్ని లక్షల మందికి వరంలా మారింది. చేతిలో మొబైల్ ఉంటే ప్రపంచాన్ని కళ్ల ముందు ఉంచుతోంది. అయితే ఈ సోషల్ మీడియా మోజు కొంతమందికి శాపంలా మారుతోంది. ఆర్థికంగా నష్టపోయేలా చేస్తోంది. తాజాగా హర్యానా (Haryana) రాష్ట్రంలోని గుర్గావ్ (Gurgao)లో అలాంటి ఘటనే చోటుచేసుకుంది. మనవరాలు తన స్నేహితురాలితో చేసిన చాటింగ్.. అమ్మమ్మ తన అకౌంట్ నుంచి రూ.80 లక్షలు పోగొట్టుకోవడానికి కారణమైంది.
వివరాల్లోకి వెళ్తే.. గుర్గావ్కు చెందిన ఓ 10వ తరగతి బాలిక తన స్నేహితురాలితో చాటింగ్ చేసింది. ఈ సందర్భంగా తన అమ్మమ్మ ఖాతాలో రూ.80 లక్షలు ఉన్న విషయాన్ని చెప్పింది. ఈ విషయాన్ని స్నేహితురాలి సోదరుడు విని, తన స్నేహితుడికి చెప్పాడు. ఆ తర్వాత వారు నవీన్ కుమార్ అనే మరో వ్యక్తితో కలిసి ఆ రూ.80 లక్షలు కాజేయడానికి స్కెచ్ వేశారు. ఆ మేరకు నవీన్ కుమార్ అనే వ్యక్తి బాలికను ఆన్లైన్ పరిచయం చేసుకున్నాడు.
అమ్మమ్మ బ్యాంక్ ఖాతాను బాలిక ఆన్లైన్లో ఆపరేట్ చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. ఆ తర్వాత బాలికతో తరచూ చాటింగ్ చేస్తూ ఆమె నమ్మకాన్ని చూరగొన్నాడు. క్రమంగా ఆమెతో వీడియో కాల్స్ మాట్లాడటం ప్రారంభించాడు. ఆమెను వీడియో రికార్డు చేసి మార్ఫింగ్ చేశాడు. ఆ మార్ఫింగ్ ఫొటోలు చూపిస్తూ బ్లాక్ మెయిలింగ్ మొదలుపెట్టాడు. కావాల్సినప్పుడల్లా డబ్బులు బదిలీ చేయించుకుంటూ వచ్చాడు. ఇలా మొత్తం రూ.80 లక్షలను కాజేశాడు. అయినా బాలిక ఈ విషయాన్ని ఇంట్లో చెప్పలేదు.
ఆఖరికి బాలిక స్నేహితురాలు స్కూల్లో టీచర్‌కు చెప్పడంతో విషయం బయటికి వచ్చింది. టీచర్ కుటుంబసభ్యులకు ఈ విషయం తెలిపి పోలీస్ కంప్లెయింట్ ఇప్పించింది. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు నవీన్ కుమార్‌ను అరెస్ట్ చేశారు. అతడి నుంచి రూ.5.13 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. బాలిక ఏటీఎం కార్డును కూడా రికవరీ చేశారు. ఈ నేరంలో నవీన్‌కుమార్‌తోపాటు మరో ఐదుగురి ప్రమేయం ఉన్నట్లు గుర్తించారు. వారి కోసం గాలింపు చేపట్టారు.