Yuvaraj Singh | మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తాను బుక్ చేసుకున్న ఫ్లాట్‌ను డెలివరీ చేయడంలో జాప్యం జరుగుతుందని.. తనకు, రియల్ ఎస్టేట్ కంపెనీకి మధ్య ఉన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మధ్యవర్తిని నియమించాలని కోర్టును కోరారు. ఈ మేరకు కోర్టు రియల్ ఎస్టేట్ కంపెనీకి నోటీసులు జారీ చేసింది. రియల్ ఎస్టేట్ సంస్థ బ్రిలియంట్ ఎటోయిల్ ప్రైవేట్ లిమిటెడ్‌ను సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. వ్యక్తిగత హక్కులను ఉల్లంఘించారని, కంపెనీ తాను బుక్ చేసిన ఫ్లాట్ డెలివరీలో జాప్యం జరిగిందని యూవీ ఆరోపించారు. మాజీ క్రికెటర్ 2021లో ఢిల్లీలోని హౌస్ఖాన్ సంస్థతో ఒక ఫ్లాట్ బుక్ చేశారు. ఆ సమయంలో ఫ్లాట్ ధర రూ.14.10కోట్లుగా పేర్కొన్నాడు.
యూవీకి నవంబర్ 2023లో స్వాధీనం చేసుకోవాలని కంపెనీ నుంచి లెటర్ వచ్చింది. ఫ్లాట్‌ను సందర్శించిన సమయంలో పనుల్లో నాణ్యత లోపించిందని.. బిల్డర్ మెటీరియల్స్ రాజీ పడ్డారని, అపార్ట్మెంట్ ఫిట్టింగ్‌లు, ఫర్నిషింగ్‌లు, లైటింగ్, ఫినిషింగ్ నాణ్యత ఏమాత్రం బాగాలేదని పేర్కొన్నారు. ఫ్లాట్ డెలివరీలో జాప్యం, నాసిరకం మెటీరియల్స్ వాడినందుకు నష్టపరిహారం చెల్లించాలని యూవీ కోరారు. డెవలపర్ తన బ్రాండ్ విలువను దుర్వినియోగం చేశాడని.. ఒప్పంద కాలానికి మించి తన వ్యక్తిత్వ హక్కులను ఉపయోగించడం ద్వారా అవగాహన ఒప్పంద (MOU) నిబంధనలను ఉల్లంఘించినట్లుగా ఆరోపించారు. నవంబర్ 2023 తర్వాత ప్రాజెక్టు ఎంఓయూ రద్దయినా బిల్‌బోర్డులు, ప్రాజెక్ట్ సైట్లు, సోషల్ మీడియా పోస్టుల్లో తన ఫొటోలను ఉపయోగించారని పేర్కొన్నారు.