న్యూఢిల్లీ, ఆగస్టు 17: తమకు ప్రత్యేక అధికార యంత్రాంగం కావాలంటూ మణిపూర్‌లోని కుకీ తెగకు చెందిన ఎమ్మెల్యేలు డిమాండ్ చేస్తున్నారు. కుకీ తెగ ప్రాబల్యం అధికంగా ఉన్న ఐదు జిల్లాలకు కలిపి ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ (సీఎస్), డీజీపీని నియమించాలని కోరుతున్నారు. ఈ మేరకు 10 మంది ఎమ్మెల్యేలు ప్రధాని మోదీకి లేఖ రాశారు. వీరిలో ఏడుగురు బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారు.
చురాచాంద్‌పూర్, కాంగ్పోక్పి, చాందెల్, తెంగ్నౌపాల్, ఫెర్జాల్ జిల్లాలకు ప్రత్యేకంగా చీఫ్ సెక్రటరీ, డీజీపీని నియమించాల్సిందేనని ఆ లేఖలో కోరారు. కుకీ తెగకు చెందిన ఐఏఎస్, ఐపీఎస్‌లు విధులు నిర్వర్తించలేకపోతున్నారని, ప్రత్యేక చీఫ్ సెక్రటరీ, డీజీపీ నియామకం అనివార్యమని తెలిపారు.