Creamy Layer | న్యూఢిల్లీ, ఆగస్టు 9: రాజ్యాంగంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లో క్రిమీలేయర్ నియమం లేదని కేంద్ర మంత్రివర్గం శుక్రవారం స్పష్టం చేసింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లలో క్రిమీలేయర్ విధానం ఉండాలని ఇటీవల సుప్రీంకోర్టు తీర్పులో చేసిన సూచనలపై శుక్రవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో చర్చ జరిగినట్టు కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. రాజ్యాంగ నిబంధనలకు ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని, ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ విషయంలో రాజ్యాంగం మేరకు ప్రభుత్వం నడుచుకుంటుందని స్పష్టం చేశారు.
దేశంలో రూ.24,657 కోట్ల అంచనాతో ఎనిమిది రైల్వే ప్రాజెక్టులకు ఆర్థిక వ్యవహారాలపై క్యాబినెట్ కమిటీ ఆమోదం తెలిపినట్టు అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. తెలంగాణలోని భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సహా ఒడిశా, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, బీహార్, పశ్చిమ బెంగాల్ రాష్ర్టాల్లోని 14 జిల్లాల పరిధిలో ఈ ప్రాజెక్టులు వస్తాయని, 900 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ వస్తుందని తెలిపారు.
గ్రామీణ ప్రాంతాల్లో రానున్న ఐదేండ్లలో రెండు కోట్ల ఇండ్లు నిర్మించాలనే లక్ష్యంతో చేపట్టనున్న ప్రధానమంత్రి అవాస్ యోజన – గ్రామీణ(పీఎంఏవై-జీ) పథకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, దేశంలో ఉద్యాన రంగాన్ని పెంపొందించేందుకు రూ.1,766 కోట్ల వ్యయంతో క్లీన్ ప్లాంట్ ప్రోగ్రామ్(సీపీపీ)ను క్యాబినెట్ ఆమోదించింది.
ఎస్సీ, ఎస్టీలలో క్రిమీలేయర్ గుర్తింపునకు సంబంధించి సుప్రీంకోర్టు ఇటీవలి వ్యాఖ్యల నేపథ్యంలో బీజేపీ ఎంపీల బృందం శుక్రవారం ప్రధాని మోదీతో సమావేశమైంది. ఈ సందర్భంగా ఎంపీలు క్రిమీలేయర్ అంశంపై మోదీ వద్ద ఆందోళన వ్యక్తం చేశారు. ఎస్సీ, ఎస్టీల్లో కూడా క్రిమీలేయర్ను గుర్తించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు ఒక పాలసీని రూపొందించాలని, తద్వారా వారికి రిజర్వేషన్ల లబ్ధి నిరాకరించాలని ఈ నెల 1న జస్టిస్ బీఆర్ గవాయ్ పేర్కొన్న విషయం తెలిసిందే. మోదీతో భేటీ అనంతరం బీజేపీ రాజ్యసభ ఎంపీ సికందర్ కుమార్ మాట్లాడుతూ సుప్రీంకోర్టు వ్యాఖ్యలపై తాము ఆందోళన వ్యక్తం చేస్తున్నామని, దీనిపై ప్రజల నుంచి కూడా తమకు ఫోన్లు వస్తున్నాయని తెలిపారు. న్యాయస్థానం వ్యాఖ్యలను ప్రభుత్వం అమలు చేయబోదని ప్రధాని మోదీ తమకు హామీ ఇచ్చారని వెల్లడించారు.