హైదరాబాద్ : ప్రధాని నరేంద్ర మోదీ గొప్ప విజయాలు సాధించినట్లుగా జీ-20 సమావేశంలో కథనాలు ప్రచారం చేస్తున్నారని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీసీ రాఘవులు విమర్శించారు. జీ-20 పూర్తిగా ఫెయిల్యూర్ అని, దాని లక్ష్యం నెరవేరదన్నారు. సంపన్న దేశాలు వడ్డీ రేట్లు పెంచుకుంటుపోతున్నాయని, దీంతో మనం సైతం పెంచాల్సి వచ్చిందన్నారు. దీంతో దేశం తీవ్ర ఇబ్బందులు పడుతుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. పర్యావరణ సదస్సులో సంపన్న దేశాలు పర్యావరణాన్ని నాశనం చేస్తున్నాయని మండిపడ్డారు.
అంతర్జాతీయ స్థాయిలో ఈ సమావేశంలో వారిపై ఒత్తిడి చేయాల్సిందన్న ఆయన.. ఈ విషయంలో విఫలం అయ్యారని ఆరోపించారు. ఇంగ్లండ్ వలస వచ్చే వారిని తీవ్ర ఇబ్బందులు పెడుతున్నారని, మొన్న రాజీనామా చేసిన మంత్రి ఆసియన్ వారిపై వివక్ష చూపించారని విమర్శించారు. రిషి సునాక్ అంతకు మించి వ్యవహరిస్తున్నారన్నారు. గుజరాత్ ఎన్నికల్లో అభివృద్ధి చూసి ఓటేయాలని చెప్పే సిద్ధాంతం నుంచి.. మతాన్ని చూసి ఓటేయాలని చెప్పే పరిస్థితి వచ్చిందన్నారు. అక్కడ గతంలో సాధించిన విజయాలు.. ఇప్పటి విజయాలు ఎక్కడా చెప్పడం లేదని, వెల్ఫేర్ స్కీమ్స్‌పై చులకన చేసి ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు.