న్యూఢిల్లీ: ప్రతిపక్షాల్ని దెబ్బతీసేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థల్ని మోదీ సర్కార్ ఒక ఆయుధంగా మలుచుకుందని సీపీఎం ఆరోపించింది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు మరికొద్ది నెలల్లో ఉన్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కె.కవితను కేసుల పేరుతో ఈడీ, సీబీఐలు వేధిస్తున్నాయని సీపీఎం పత్రిక ‘పీపుల్స్ డెమోక్రసీ’ ఎడిటోరియల్ వ్యాసం అభిప్రాయపడింది. ప్రతిపక్షాలే లక్ష్యంగా సీబీఐ, ఈడీలను కేంద్రం ఉసిగొల్పుతున్నదని ఎడిటోరియల్ ఆరోపించింది.
సీబీఐ కేసులు నమోదుచేయటం, దాంట్లో పసలేకపోతే, ఆ వెంటనే ఈడీని రంగంలోకి దింపి మనీలాండరింగ్ కేసులు పెట్టడం ఆనవాయితీగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది. బీజేపీయేతర పార్టీలే లక్ష్యంగా ఈడీ, సీబీఐ దాడులు కొనసాగుతున్నాయని పేర్కొంది. మనీలాండరింగ్ చట్టంలోని నిబంధనలు ఈడీకి అపరమిత అధికారాల్ని కట్టబెట్టిందని, సోదాలు, ఆస్తులు జప్తు, నిందితుల్ని జైల్లో నిర్బంధించటం వంటివి అమలుజేస్తున్నదని తెలిపింది. కేసుల్లో ఇరుక్కున్న నిందితులకు బెయిల్ లభించటం దుర్లభంగా మారిందని ఆందోళన వ్యక్తం చేసింది.
ఈ కేసులు రాజకీయ ప్రేరేపితం తప్ప మరోటి కాదని ‘పీపుల్స్ డెమొక్రసీ’ తెలిపింది. ఎమ్మెల్సీ కవితపై ఈడీ కేసును ప్రస్తావిస్తూ ‘ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. రాజకీయ లక్ష్యాల్ని చేరుకోవటం కోసం బీజేపీ అధిష్టానం తెలంగాణలో తన ప్రయత్నాల్ని ముమ్మరం చేసింది. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్ నాయకురాలు కవిత పేరును ఢిల్లీ లిక్కర్ కేసులో చేర్చింది. ఎన్నికల ప్రయోజనాల్ని నెరవేర్చుకునేందుకు ఈడీ, సీబీఐలను మోడీ సర్కార్ ఎలా దుర్వినియోగం చేస్తున్నదో చెప్పడానికి ఇదొక నిదర్శనం’ అని పీపుల్స్ డెమొక్రసీ విశ్లేషణాత్మకంగా వివరించింది.