హిమాయత్‌నగర్: కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్‌ను నిలిపివేసి మావోయిస్టులతో చర్చలు జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కూడా రజతోత్సవ సభలో లక్షలాది మంది ప్రజల సమక్షంలో ఆపరేషన్ కగార్‌ను ఆపి, శాంతి చర్చలు జరపాలని డిమాండ్ చేసిందని చెప్పారు. బుధవారం హైదర్‌గూడలోని ఎన్ఎస్ఎస్లో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో తెలంగాణ పౌర హక్కుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం లక్ష్మణ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎన్ నారాయణరావు, ప్రొఫెసర్ హరగోపాల్ తదితరులు మాట్లాడారు. కర్రెగుట్టను వేలాది పోలీసు బలగాలు చుట్టుముట్టి ఆదివాసీలను, మావోయిస్టులను కేంద్రం హతమారుస్తున్నదని, బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నదని ఆరోపించారు. మనుషుల ప్రాణాలకు విలువలేకుండా చేయడం అనాగరికమని హరగోపాల్ పేర్కొన్నారు.
హైదరాబాద్, మే 21 (నమస్తే తెలంగాణ): కేంద్ర ప్రభుత్వం ఆపరేషన్ కగార్ పేరుతో హత్యాకాండను కొనసాగిస్తున్నదని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కమిటీ కార్యదర్శి పీ సూర్యం విమర్శించారు. అందులో భాగంగానే బుధవారం అబూజ్‌మడ్‌లో ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతోపాటు 25 మందికిపైగా మృతి చెందారని పేర్కొన్నారు. అడవి నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి, అక్కడి సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టడానికే కేంద్రం ఆపరేషన్ కగార్‌ను చేపట్టిందన్నారు.
న్యూఢిల్లీ: ఛత్తీస్‌గఢ్‌లో పలువురు ఆదివాసీలతోపాటు మావోయిస్టు అగ్రనేతను హతమార్చడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు సీపీఐ ప్రకటించింది. తీవ్రవాద నిరోధక ఆపరేషన్ల ముసుగులో నిర్వహించిన చట్ట వ్యతిరేక చర్యకు సంబంధించిన మరో ఉదంతంగా తాజా ఎన్‌కౌంటర్‌ను అభివర్ణించింది. తాజా ఉదంతంతోపాటు మొత్తం ఆపరేషన్ కగార్‌పై స్వతంత్ర న్యాయ విచారణ జరపాలని సీపీఐ డిమాండు చేసింది. మావోయిస్టు అగ్రనేత ఆచూకీ గురించి విశ్వసనీయమైన నిఘా సమాచారం అధికారుల వద్ద ఉన్నపుడు చట్టపరంగా అరెస్టు చేయడానికి ఎందుకు ప్రయత్నించలేదని, రాజ్యాంగం ఇచ్చిన హామీలను బాహాటంగా ఎందుకు విస్మరించారని సీపీఐ ప్రధాన కార్యదర్శి డీ రాజా ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
శాంతిచర్చలకు సిద్ధమేనని మావోయిస్టులు ప్రకటించినప్పటికీ.. కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎన్కౌంటర్లు చేయడం అప్రజాస్వామికమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు పేరొన్నారు. సమాజంలో వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాస్వామిక వాదులు, అభ్యుదయ వాదులు, మేధావులు రచయితలు తక్షణమే మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని కోరుతున్నప్పటికీ కేంద్రం మొండివైఖరి ప్రదర్శిస్తున్నదని విమర్శించారు.
వామపక్ష భావజాలాన్ని అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ కగార్ చేపట్టి విచ్చలవిడిగా మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యులు చాడ వెంకట్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉగ్రవాదులకంటే దారుణంగా మన దేశ పౌరులైన మావోయిస్టులను కాల్చి చంపుతున్నారని ఒక ప్రకటనలో విమర్శించారు.
హైదరాబాద్, మే 21 (నమస్తేతెలంగాణ): ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ అడవుల్లో మావోయిస్టు అగ్రనేత నంబాల కేశవరావుతో పాటు 27 మందిని కాల్చి చంపడాన్ని సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తున్నదని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ పేర్కొన్నారు. మావోయిస్టులతో చర్చలు జరపాలని కేంద్ర ప్రభుత్వానికి మావోయిస్టులు, ప్రజాసంఘాలు, విపక్ష పార్టీలు అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ, కేంద్రం మూర్ఖంగా నక్సలైట్లను, సానుభూతి పేరుతో గిరిజనులను కాల్చి చంపే నరహంతక చర్యలకు పాల్పడుతున్నదన్నారు.